దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేస్తా!

ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చరిత్రలో లేదని మాజీ మంత్రి దానం నాగేందర్ గురించి ప్రస్తావిస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.  అలా జరిగినా స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల అనుసరించి దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ వేస్తున్నామని వెల్లడించారు. 
 
త్వరలో  పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు. దానం ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి, మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినా ఆయన మీద స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపు కి పాల్పడిన దానం పై 90 రోజుల్లో చర్య తీసుకోవాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారి ఇళ్ల ముందు చావు డప్పు కొట్టమన్నారని బిజెపి నేత గుర్తు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటోందని పేర్కొంటూ మరి ఆ ఎమ్మెల్యేల ఇంటి ముందు ఏ డప్పు కొట్టాలో చెప్పాలని ముఖ్యమంత్రిని బిజెపి నేత ప్రశ్నించారు. 
 
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేద్దామని ఎన్ని సార్లు కార్యాలయానికి వెళ్లినా అందుబాటులో ఉండటం లేదని ఆయన తెలిపారు. అపాయింట్ అడిగినా సమయం ఇవ్వడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.  కాగా, ఎన్నికల సమయంలో దొంగ డిక్లరేషన్ల పేరుతో అభయ హస్తం హామీల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం మరోసారి తన వక్రబుద్దిని చూపించిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 
 
నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలండర్ హమీ, జాబ్ నోటిఫికేషన్లు, ప్రోత్సహకాలు ఇలా ఎన్నో హామీలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు హామీలు చేయాలని నిరుద్యోగులు అడిగితే దాడులు చేయించడం సరికాదని హెచ్చరించారు. దీక్ష చేస్తున్న నిరుద్యోగులను కలిసేందుకు ఎవరు వెళ్లకుండా గాంధీ ఆసుపత్రి వద్ద మీడియాకు ఆంక్షలు విధించడమేనా మీరు చెప్పిన ప్రజాపాలనా ? అని ప్రశ్నించారు. 
 
నిరుద్యోగ యువతపై కనికరం లేకుండా లాఠీఛార్జ్ చేయించడం అమానుషమని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పటి వరకు భర్తీ చేస్తారో చెప్పాలని మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి, ఢిల్లీకి పర్యటనలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలు వదిలేసి, ప్రైవేట్ కార్యక్రమాలకు ప్రియారిటీ ఇస్తున్నారని, ఆ అంటే..ఊ అంటే ఢిల్లీకి వెళ్తూ…తెలంగాణ ఆత్మగౌరవాన్నిఢిల్లీ విధుల్లో తాకట్టుపెడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన  ఆరు అవినీతి ఆరోపణల మీద ఆధారాలు ఇచ్చామని, ఇందులో ఏ ఒక్క దాని మీద కూడా చర్యలు తీసుకోలేదని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.  సివిల్ సప్లై మంత్రి మీద చేసిన ఆరోపణలకు స్పందించని అసమర్థత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది అంటూ దుయ్యబట్టారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైకిల్ చేస్తూ, వందల కోట్లు అవినీతి జరుగుతున్నా  మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు.  

 
ఇదే మంత్రి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జరిగే అవినీతి పై అన్ని ఆధారాలు బయట పెడతానని చెబుతూ  రిటైర్డ్ జడ్జి తో కమిటీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.   ఎన్నికలకు ముందు వైద్యానికి పెద్దపీట వేస్తామన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.