ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్‌ అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7 వేల పింఛన్‌ మొత్తాన్ని అర్హులకు అందిస్తున్నది.
 
 అనంతరం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలో మొదటగా పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమమని చెప్పారు. వారి జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడిందని తెలిపారు. సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్‌ చెప్పారని, ఆయన స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. 
 
పేదలపై శ్రద్ధపెడతామని, అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామని చెబుతూ ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచనని వెల్లడించారు. దివ్యాంగులకు పింఛన్‌ను రూ.6 వేలు చేశామని తెలిపారు. వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉందని తెలిపారు. 
 
గత పాలకులు, అధికారులు సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ తమ వల్ల కాదన్నారని, నేడు 1.25 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పంపిణీ జరుగుతున్నదని వెల్లడించారు. తర్వలోనే 183 అన్నా క్యాంటిన్లు ప్రారంభిస్తామని, యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వమని, నిరంతరం ప్రజలకోసం పనిచేస్తాని స్పష్టం చేశారు. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు పింఛనుదారులకు రూ.3 వేల చొప్పున అందుతుండగా ప్రభుత్వం తాజాగా ఆ మొత్తానికి రూ.4 వేలుగా చేసింది.  దీంతోపాటు ఏప్రిల్‌ నుంచే పెంచిన దానిని అమలు చేస్తామన్న ఎన్నికల హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు రూ.1,000 చొప్పున కలిపి మొత్తం రూ.7 వేలు నేడు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.4,408 కోట్లు విడుదల చేసింది.