దేశంలో అమల్లోకి కొత్త న్యాయ చట్టాలు

బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్‌ పీనల్‌ కోడ్ ‌(ఐపీసీ), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌(సీఆర్‌పీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌) చట్టాలను తీసుకువచ్చారు. 
 
ఈ క్రమంలో కొత్త చట్టాల కింద తొలి కేసు నమోదయింది. అదికూడా దేశ రాజధానిలోనే కావడం గమనార్హం.  న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై గత అర్ధరాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ‍ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్‌ బాటిల్స్‌ అమ్ముతూ వారికి కనిపించాడు. దీంతో దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉన్నదని, దానిని తీసేయాలని ఆ వ్యాపారికి చెప్పారు. 
 
ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినకపోవడంతో భారతీయ న్యాయ సంహిత క్రిమినల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 285 ప్రకారం.. కమలా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదుచేసినట్లు పోలీఉలు తెలిపారు. నిందితుడిని బీహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్‌ కుమార్‌గా గుర్తించారు. ఈ సెక్షన్‌ ప్రకారం.. రోడ్లను ఆక్రమించడం, తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. జరిమానా రూ.5 వేల వరకు ఉంటుంది.
 

కొత్త చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..

  • మైనర్‌పై సామూహిక లైంగిక దాడికి పాల్పడితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన. పిల్లలను అమ్మడం లేదా కొనడం క్రూరమైన నేరం.
  • జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానంతో ఒక వ్యక్తి పోలీసుస్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా ఏదైనా ఘటనను రిపోర్టు చేయడంలో లేదా చట్టపరమైన చర్యలు ప్రారంభించడంలో ఆలస్యాన్ని నివారించొచ్చు.
  • ఏదైనా ఘటనను ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలుంది. పోలీసుస్టేషన్‌కు వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు. దీని ద్వారా వేగవంతమైన ఫిర్యాదు ద్వారా అదే వేగంతో పోలీసులు తగిన చర్యలు తీసుకొనే వెసులుబాటు ఉంటుంది.
  • ఎలక్ట్రానిక్‌ రూపంలో సమన్లు జారీ చేయవచ్చు. దీని ద్వారా చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు పేపర్‌ వర్క్‌ను తగ్గిస్తుంది.
  • లైంగిక దాడి బాధితురాలి స్టేట్‌మెంట్‌ను ఆమె సంరక్షకురాలు లేదా బంధువు సమక్షంలోనే ఒక మహిళా పోలీసు అధికారి రికార్డు చేయాలి. వారం రోజుల్లోగా వైద్య నివేదిక రావాలి.
  • మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి.. బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్‌ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేనిపక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచాలి.
  • ఏదైనా కేసులో నిందితులు, బాధితులు 14 రోజుల్లోగా ఎఫ్‌ఐఆర్‌, పోలీసు రిపోర్టు, చార్జిషీట్‌, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల కాపీలను పొందవచ్చు.
  • క్రిమినల్‌ కేసుల్లో విచారణ పూర్తయిన తర్వాత 45 రోజుల్లోగా తీర్పు ఇవ్వాలి. విచారణ ప్రారంభమైన 60 రోజుల్లోగా అభియోగాలు నమోదు చేయాలి.
  • కేసు విచారణలో అనవసర జాప్యాలను నివారించేందుకు, సకాలంలో న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు కూడా గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి.
  • సాక్షుల భద్రతను, వారి సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి.
  • రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే పదాన్ని చేర్చారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలను నిర్వచించారు. ఏదైనా కేసులో చేపట్టే తనిఖీలు, స్వాధీనాలను వీడియో రికార్డింగ్‌ చేయడం తప్పనిసరి.
  • వివాహం పేరుతో మోసం చేయడం, మైనర్లపై సామూహిక లైంగిక దాడికి పాల్పడటం, మూక హత్యలు, చైన్‌ దొంగతనాలు వంటి ఘటనలకు పరిష్కరించేందుకు ప్రత్యేక నిబంధనలు.
    అరెస్టు సందర్భాల్లో బాధితులు తమ పరిస్థితి గురించి సమాచారాన్ని బంధువులకు లేదా స్నేహితులకు తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా అరెస్టయిన వ్యక్తి తక్షణ సాయం పొందే వీలుంటుంది.
  • అరెస్టు వివరాలను ప్రముఖంగా పోలీసుస్టేషన్లు, జిల్లా కేంద్రాల్లో డిస్‌ప్లే చేయాలి. దీని ద్వారా అరెస్టయిన వ్యక్తి బంధువులు, స్నేహితులు ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
  • దర్యాప్తును బలోపేతం చేయడంలో భాగంగా తీవ్రమైన నేరాల విషయంలో ఫోరెన్సిక్‌ నిపుణులు తప్పనిసరిగా ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించాలి.
  • మహిళలపై నేరాల కేసుల్లో బాధితులు తమ కేసు పురోగతిపై 90 రోజుల్లోపు ఎప్పటికప్పుడు సమాచారం పొందేందుకు అర్హులు.
  • మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో బాధితులకు అన్ని దవాఖానల్లో ఉచితంగా ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్స.
  • మరింత భద్రత కల్పించడం, దర్యాప్తులో పారదర్శకతను అమలు చేయడంలో భాగంగా లైంగిక దాడి కేసుల్లో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
    మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 15 ఏండ్లలోపు పిల్లలు, 60 ఏండ్ల పైబడిన వృద్ధులు పోలీసుస్టేషన్‌కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు నివాసం ఉంటున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు.