కేరళలో సీపీఎంపై హవాలా లావాదేవీ ఆరోపణలు 

మనీ లాండరింగ్‌ ఆరోపణల కేసులో సీపీఎంను నిందితుల జాబితాలో చేర్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సిద్ధమవుతున్నది. కేరళలోని త్రిస్సూర్‌లో ఉన్న కరువన్నూర్‌ కోఆపరేటీవ్‌ బ్యాంక్‌లో నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన కేసును ఈడీ గత ఏడాది నుంచి విచారిస్తున్నది. సీపీఎం ఆధ్వర్యంలో నడిచే ఈ బ్యాంకులో సిబ్బంది, స్థానిక సీపీఎం నేతలు రూ.300 కోట్లకు పైగా నిధులను స్వాహా చేశారనే ఆరోపణలు వచ్చాయి.
 
రాష్ర్టాన్ని కుదిపేసిన ఈ వ్యవహారంలో సీపీఎం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఏసీ మోయిదీన్‌కు బ్యాంకు బినామీ లోన్లను మంజూరు చేసిందని ఈడీ గత ఏడాది పేర్కొన్నది. మోయిదీన్‌ గతంలో త్రిస్సూర్‌ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పని చేశారు. అయితే ఈ కేసులో సీపీఎం ప్రమేయం కూడా ఉందని ఈడీ భావిస్తున్నది. 
 
ఇప్పటికే పార్టీకి చెందిన కార్యాలయ స్థలం, వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న రూ.60 లక్షలను ఈడీ జప్తు చేసింది. ఇప్పుడు పార్టీని సైతం నిందితుల జాబితాలో చేర్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కరువాన్నూర్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో హవాలా లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఎం భూమి, బ్యాంకు డిపాజిట్లు జప్తు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి.

కొద్ది నెలల క్రితం ఢిల్లీ మద్యం విధానం కేసులో మొదటి సారిగా ఓ రాజకీయ పార్టీ ఆప్ ను నిందితునిగా పేర్కొన్న ఈడీ తాజాగా సిపిఎంను పేర్కొనబోతున్నట్లు స్పష్టం అవుతుంది.  అయితే, తాము హవాలా లావాదేవీలకు పాల్పడలేదని, తప్పు చేయలేదని సీపీఎం వాదిస్తోంది. సీపీఎం ఆస్తులను హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జప్తు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి.  

త్రిసూర్ జిల్లాలో రూ.10 లక్షల విలువైన భూమి, సీపీఎంకు చెందిన ఐదు గుర్తు తెలియని రూ.63 లక్షల బ్యాంకు డిపాజిట్లను జప్తు చేసింది. ఈ కుంభకోణం 2021లో కేరళలోని బలమైన సహకార ఉద్యమంలో గర్వించదగిన ఈ బ్యాంకును నియంత్రిస్తున్న రాష్ట్ర సిపిఎంని కుదిపేసింది.   18 కేసులకు సంబంధించి 11 మంది బ్యాంకు పాలకమండలి సభ్యులు, ఆరుగురు సిబ్బందిని అరెస్టు చేశారు.

సీపీఎం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఏసీ మొయిదీన్‌ ఆదేశాల మేరకు బ్యాంకు బినామీ రుణాలు మంజూరు చేసిందని గతేడాది చెప్పారు. 2023 ఆగస్టులో త్రిసూర్‌లోని మొయిదీన్ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. ఎల్‌డీఎఫ్ హయాంలో 2016 నుంచి 2021 వరకు స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రిగా  మొయిదీన్ పనిచేశారు. 

 బ్యాంకులో 12,000 మంది డిపాజిటర్లు ఉన్నారు. కొంతమంది తమ పొదుపు మొత్తాలను తిరిగి ఇవ్వడంలో విఫలమవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలను సీపీఎం తిరస్కరించింది. కరువన్నూర్ బ్యాంకు కుంభకోణంపై ఈడీ దర్యాప్తు విషయమై రాజకీయంగా పోరాడతామని సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. 

రాజకీయ కారణాలరీత్యా విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం ఈడీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ తమకు వ్యతిరేకంగా సాక్షాధారాలు సేకరించడంలో విఫలమైందని విమర్శించారు.

 “సీపీఎం పద్ధతి ప్రకారం పార్టీ కార్యాలయాల కోసం భూమిని సంబంధిత జిల్లా కమిటీలు కొనుగోలు చేస్తాయి. అయితే టైటిల్ డీడ్ మాత్రం పార్టీ జిల్లా కార్యదర్శి పేరు మీద అమలు చేయబడుతుంది” అని చెప్పుకొచ్చారు. త్రిస్సూర్‌లోని పొరతిస్సేరీలో జప్తు చేసిన భూమి పార్టీ బ్రాంచ్ కమిటీ కార్యాలయం కోసం ఉద్దేశించబడింది.

సీపీఎం జిల్లా కార్యదర్శి ఎంఎం వర్గీస్‌ పేరిట దీన్ని అమలు చేశారు. భూమిని కొనుగోలు చేసేందుకు నల్లధనాన్ని తరలించారని ఆరోపించారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో మొదటిసారిగా బిజెపి అభ్యర్థిగా నటుడు-రాజకీయవేత్త  సురేష్ గోపీని లోక్ సభకు పంపిన  త్రిసూర్ నియోజకవర్గంలో ఈ విషయం ఎన్నికల ప్రచారంలో సహితం కీలక ప్రచార అస్త్రంగా మారింది.