కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్

కొండగట్టు అంజన్నను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ శనివారం దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆర్కిటెక్ట్‌ ఆనంద్ సాయితో కలిసి ఆలయానికి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌కు షామీర్‌పేట, తుర్కపల్లి, సిద్దిపేటలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సిద్దిపేటలో ఏపీ ఉపముఖ్యమంత్రికి అభిమానులు గజమాలతో సత్కరించారు. 

ఏపీ ఎన్నికల్లో విజయభేరి మోగించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అభిమానులు పవన్‌ కల్యాణ్‌ను చూడటానికి అధిక సంఖ్యలో వచ్చారు.అభిమానులు, పార్టీ శ్రేణుల నీరాజనాల మధ్య కొండగట్టుకు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌కు ఆలయ ఈవో చంద్రశేఖర్‌, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. 

ఆలయంలో పవన్‌ ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యుల పేర్లతో అర్చన చేయించారు. మొక్కులు చెల్లించుకుని అంజన్న సేవలో తరించారు. అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్‌ పవన్ కళ్యాణ్‌ను కలిసి కొండపై అంజన్న భక్తుల వసతి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరు చేయించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. 

చిరంజీవి అనే వ్యాపారి పవన్‌కు 9 కిలోల ఇత్తడి ప్రతిమను అందజేశారు. అభిమానులు పవన్ చిత్రపటాలు, జనసేన జెండాలతో సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. పవన్ కొండగట్టు అంజన్న దర్శనానికి వెళుతుండగా రాజీవ్ రహదారి పొడవునా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. 

రాజీవ్ రహదారిపై అడుగడుగునా పవన్ నినాదాలతో హోరెత్తింది. అంతకుముందు సిద్ధిపేటలో పవన్‌ను అభిమానులు గజమాలతో సన్మానించారు. అభిమానులందరికీ అభివాదం చేస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, జై తెలంగాణ జై హింద్ అంటూ ప్రతిచోట్ల నినాదాలు చేసి వాహన శ్రేణిని ముందుకు కదిలించారు. 

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష పాటిస్తున్నారు. దీక్ష సమయంలో పవన్ కల్యాణ్ కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. మంగళవారం నుంచి పవన్ ఈ దీక్ష పాటిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో కూడా పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పాటించారు.