టీ 20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన కోహ్లీ, రోహిత్

భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత త‌మ రిటైర్‌మెంట్‌పై కోహ్లి, రోహిత్ వేర్వేరుగా ప్ర‌క‌ట‌న‌లు చేశారు. టీ20 వ‌రల్డ్ లీగ్ ద‌శ‌తో పాటు సూప‌ర్‌8, సెమీస్‌లో దారుణంగా విఫ‌ల‌మైన కోహ్లి ఫైన‌ల్‌లో అద‌ర‌గొట్టాడు.  23 ప‌రుగులుకే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ భార‌త్ జ‌ట్టును హాఫ్ సెంచ‌రీతో (59 బాల్స్‌లో 76 ర‌న్స్‌)తో ఆదుకున్నాడు. ఫైన‌ల్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకొని ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20ల‌కు బైబై చెప్పాడు కోహ్లి.
 
జట్టు విజయంలో కీలకమైన నేపథ్యంలో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్న కోహ్లీ మాట్లాడుతూ ‘ఇది నా కెరీర్‌లో చివరి టీ20 ప్రపంచకప్‌. ఏదైతే సాధించాలనుకున్నామో అది అందుకున్నాం. భారత్‌ తరఫున టీ20ల్లో ఇదే చివరి మ్యాచ్‌. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. టీ20లను ముందుకు తీసుకెళ్లేందుకు యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. ఐసీసీ ట్రోఫీ కోసం ఏండ్లుగా ఎదురుచూశాం. రోహిత్‌కు ఇది తొమ్మిదో టీ20 ప్రపంచకప్‌ అయితే..నాకిది ఆరోది. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నాం. ఇది చిరకాలం మా మదిలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని తెలిపాడు.
 
ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20ల‌కు గుడ్‌బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ ఇండియా త‌ర‌ఫున త‌న చివ‌రి టీ20 మ్యాచ్ అని రోహిత్ శ‌ర్మ చెప్పాడు. ఈ ఫార్మెట్‌కు వీడ్కోలు చెప్పేందుకు ఇంత‌కుమించిన మంచి స‌మ‌యం లేదు. టీ20 కెరీర్‌లోని ప్ర‌తి క్ష‌ణాన్ని ఎంజాయ్ చేశా. వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాల‌ని అనుకున్నాను. గెలిచాను అని రోహిత్ శ‌ర్మ అన్నాడు.

టీమిండియా త‌ర‌ఫున టీ20 క్రికెట్‌లో 159 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శ‌ర్మ‌4231 ప‌రుగులు చేశాడు. టీ20 ఫార్మెట్‌లో రోహిత్ శ‌ర్మ ఐదు సెంచ‌రీలు చేశాడు. ఈ పొట్టి క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. బౌలింగ్‌లోనూ ఓ వికెట్ తీసుకున్నాడు.

మ‌రోవైపు టీ20 ఫార్మెట్‌లో 125 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 4188 ర‌న్స్ చేశాడు. ఒక సెంచ‌రీతోపాటు 38 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. బౌలింగ్‌లోనూ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల‌తో పాటు కోచ్‌గా ద్రావిడ్‌కు టీమిండియా త‌ర‌ఫున ఇదే చివ‌రి మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. ద్రావిడ్ కూడా వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ గెలిచి కోచ్ ప‌ద‌వికి గుడ్‌బై చెప్పాడు.