మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ పరువు నష్టం దావా

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ శుక్రవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం దావా వేశారు. రాజ్‌భవన్‌లో కార్యకలాపాల కారణంగా భవన్ సందర్శనకు తాము భయపడుతున్నామని మహిళలు తనకు ఫిర్యాదు చేసినట్లు మమత చెప్పిన మరునాడు గవర్నర్ దావా వేసినట్లు ప్రతినిధి ఒకరు తెలియజేశారు. 

మమతా బెనర్జీ వ్యాఖ్యలకు ఆమెను బోస్ అంతకు ముందు విమర్శించారు. ‘తప్పుడు, అపఖ్యాతి కలిగించే అభిప్రాయాలు’ వ్యక్తం చేయడం ప్రజా ప్రతినిధులకు తగదని ఆయన అన్నారు. అటువంటి వ్యాఖ్యలు చేసినందుకు టిఎంసి నాయకులు కొందరిపై కూడా బెంగాల్ గవర్నర్ పరువు నష్టం దావా వేసినట్లు ఆ ప్రతినిధి తెలిపారు. 

గురువారం రాష్ట్ర సచివాలయంలో పాలనా యంత్రాంగం సమావేశంలో మమత ప్రసంగిస్తూ, ‘రాజ్‌భవన్‌లో ఇటీవల కొన్ని సంఘటనల గురించి అందిన సమాచారం వల్ల భవన్‌ను సందర్శించేందుకు తాము భయపడుతున్నట్లు మహిళలు నాకు తెలియజేశారు’ అని చెప్పారు. ‘గవర్నర్ సివి ఆనంద బోస్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైన, ఆమె పార్టీ నాయకులపైన వారి వ్యాఖ్యలకు గాను పరువునష్టం దావా వేశారు’ అని ఆ ప్రతినిధి తెలిపారు. 

మే 2న రాజ్‌భవన్‌లో కాంట్రాక్ట్‌పై పని చేసే ఒక మహిళా ఉద్యోగి బోస్‌పై అత్యాచారం ఆరోపణ చేశారు. దానితో కోల్‌కతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై టిఎంసి రాజ్యసభ ఎంపి డోలా సేన్‌ను సంప్రదించినప్పుడు పార్టీ నాయకత్వంతో చర్చించకుండా ఈ వ్యవహారంపై తాను వ్యాఖ్య చేయలేనని ఆమె చెప్పారు.

 ‘అసలు ఏమి జరిగిందో తెలుసుకునేందుకు మా పార్టీ నాయకత్వంతో నేను మాట్లాడవలసి ఉంటుంది’ అని డోలా సేన్ చెప్పారు. కాగా, బోస్ సరైన నిర్ణయం తీసుకున్నారని బీజేపీ సీనియర్ నేత రాహుల్ సిన్హా సమర్ధించారు. ‘గవర్నర్ బోస్ సరైన నిర్ణయం తీసుకున్నారని నా భావన. ఆయన చాలా కాలం క్రితమే ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. ఇందుకు ఆయనను పూర్తిగా సమర్థిస్తా’ అని సిన్హా చెప్పారు. అయితే, బోస్, మమత మధ్య ఘర్షణ రాష్ట్రానికి మేలు చేయడం లేదని సిపిఎం వెటరన్ నేత సుజన్ చక్రవర్తి విమర్శించారు.