మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలంటూ వేలాది మంది ర్యాలీ

మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్‌ చేశారు. రాజధాని ఇంఫాల్ లోయలో భారీ ర్యాలీ నిర్వహించారు. కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను రక్షించాలని నినాదాలు చేశారు. 
 
మణిపూర్ సమగ్రత కోసం ఏర్పడిన సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంఫాల్‌లో ర్యాలీ జరిగింది. కుకీల మినహా మిగతా తెగల ప్రజలు, మీరా పైబీ సంస్థకు చెందిన వృద్ధ మహిళలు ఇందులో పాల్గొన్నారు. మణిపూర్ ప్రాదేశిక సమగ్రత, స్థానిక ప్రజలను కాపాడాలంటూ నినాదాలు చేశారు. పలు ఫ్లకార్డులను ప్రదర్శించారు.

కాగా, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్సీ) కసరత్తును చేపట్టాలని, కుకీ తిరుగుబాటు గ్రూపులతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని, లోయ, కొండ ప్రాంతాల్లో సమానంగా కూంబింగ్‌ నిర్వహించాలని, మణిపూర్ ప్రాదేశిక, పరిపాలనా సమగ్రతను కాపాడాలని, ప్రజలు ఇంటికి తిరిగి రాకుండా నిరోధించే బఫర్ జోన్‌లను తొలగించాలని ఇంఫాల్‌ ప్రజలు డిమాండ్‌ చేశారు.

మరోవైపు తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని సమన్వయ కమిటీ నేత జీతేంద్ర నింగోంబ తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తాము ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. మణిపూర్ ఆదివాసీల నిర్మూలనకు సంబంధించిన అన్ని విధి విధానాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ విభజనకు తాము వ్యతిరేకమన్నారు. కేవలం శాంతిని మాత్రమే తాము కోరుతున్నామని స్పష్టం చేశారు.