ఢిల్లీలో భారీ వర్షంతో జలమయం .. రోడ్లపైకి వరదనీరు

గత మూడు నెలలుగా రికార్డు స్థాయి ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీలో గురువారం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. వర్షాల వల్ల పలు ప్రాంతాల్లోకి వరదనీరు ఉప్పొంగింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపైకి వరద నీరు రావడం వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 
 
భారీ వర్షాల వల్ల ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా, సఫ్దర్‌ జంగ్ వాతావరణ కేంద్రం 153.7 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదైనట్లు అంచనా వేసింది.
 
 శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. మూడు గంటల వ్యవధిలోనే ఢిల్లీలో 150 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణశాఖ  తెలిపింది. 24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. 1936 తర్వాత జూన్‌ నెలలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని పేర్కొంది. నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తడం వల్ల ట్రాఫిక్‌ పోలీసులు ఇబ్బందికరమైన మార్గాల వివరాలను ఎక్స్లో పోస్టు చేశారు. శాంతివన్‌ నుంచి ఐఎస్బీటీ వరకు ఔటర్ రింగ్‌ రోడ్డు రెండువైపులా ప్రయాణించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అనువర్త మార్గంలో కూడా ట్రాఫిక్కు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. 

మరోవైపు, ఢిల్లీ రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల నీటిలో నడిచి వెళ్తున్నారు. ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లలోకి కూడా వరద నీరు చేరడం వల్ల అసౌకర్యానికి గురయ్యారు.  భారీ వర్షాల కారణంగా డిల్లీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని విద్యుత్ డిస్కమ్ అధికారులు తెలిపారు. 

వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు కూలిపోయాయని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు చేపడుతున్నామని వెల్లడించారు.  ఢిల్లీలో తాజా పరిణామాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించింది. 

ఈ సమావేశానికి ఢిల్లీ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోవైపు, ఢిల్లీలో భారీ వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. నైరుతీ రుత‌ప‌వ‌నాలు ఢిల్లీకి చేరుకున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న‌ది. తీవ్ర‌మైన ఎండ‌, వ‌డ‌గాలుల‌కు బ్రేక్ చెబుతూ.. వ‌ర్షాకాలం వ‌చ్చిన‌ట్లు ఢిల్లీలోని ఐఎండీ ఆఫీసు ప్ర‌క‌టించింది.

 యావ‌త్ ఢిల్లీ ప్రాంతాన్ని నైరుతీ రుతుప‌వ‌నాలు చేరుకున్న‌ట్లు ఐఎండీ తెలిపింది. జైస‌ల్మేర్‌, చురు, భివాని, ఢిల్లీ, అలీఘ‌డ్‌, కాన్పూర్‌, ఘాజిపూర్‌, గోండా, ఖేరి, మొరాదాబాద్‌, డెహ్రాడూన్‌, ఉనా, ప‌ఠాన్‌కోట్‌, జ‌మ్మూ ప్రాంతాల‌కు నైరుతి చేరుకున్న‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది.  వర్షాలతో ఢిల్లీ తల్లడిల్లడంపై బీజేపీ ఎంపీ కమల్జీ షెహ్రవత్‌ ఆప్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తప్పుడు ఆరోపణలు గుప్పించడంలో బిజీగా మారిన ఆప్‌ ప్రభుత్వమే ఈ పరిస్ధితికి కారణమని ఆరోపించారు. 

మరోవైపు దేశ రాజధాని రోడ్లు జలమయం కావడంపై బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ స్పందిస్తూ కాలువలను శుభ్రం చేయాలని తాము గత రెండు నెలలుగా చెబుతున్నా ఢిల్లీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్వాకంతో కాలువలన్నీ మూసుకుపోయాయని, భారీ వర్షాలతో వరద ముంచెత్తిందని ఆరోపించారు. ఆప్‌ వైఫల్యానికి ఇది పరాకాష్టని విమర్శించారు.