పరస్పర దూషణలు, ఆరోపణలతో బైడెన్, ట్రంప్ డిబేట్

గత అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో గందరగోళం తర్వాత మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (81), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (78) 2024 ఎన్నికలకు సంబంధించి గురువారం ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ డిబేట్‌ జరిగింది. చర్చా వేదికపైకి రాగానే కరచాలనం కూడా చేసుకోకుండానే ఇరువురు నేతలు ఆశీనులయ్యారు. 
 
దాదాపు 90 నిముషాల పాటు సాగిన చర్చ టీవీల్లో రియాల్టీ షోను తలపించింది. అమెరికా యుద్ధోన్మాదం, ఆర్థిక వ్యవస్థ, పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి, పశ్చిమాసియా సంక్షోభం వంటి అంశాలపై ఎవరి వైఖరి ఏమిటో చెప్పకుండా, అధ్యక్షుడిగా నువ్వు చేతకానివాడివని ఒకరంటే, నువ్వు ఓడిపోయినవాడివి అని మరొకరు వ్యక్తిగత దూషణలకే సమయమంతా వెచ్చించారు.
 
దేశంలోకి శ‌ర‌ణార్థులు చొర‌బ‌డుతున్నార‌న్న అంశంపై ట్రంప్‌,  బైడెన్ మ‌ధ్య భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. తాము చేప‌డుతున్న విధానాల వ‌ల్ల ఇమ్మిగ్రేష‌న్ 40 శాతం త‌గ్గిన‌ట్లు బైడెన్ వెల్ల‌డించారు.  ట్రంప్ పాల‌న స‌మ‌యంలో శ‌ర‌ణార్థ కుటుంబాల‌ను వేరు చేసిన‌ట్లు బైడెన్ ఆరోపించారు. ఆ వ్యాఖ్య‌ల‌ను ట్రంప్ కొట్టిపారేశారు. త‌న పాల‌న స‌మ‌యంలోనే సరిహద్దు ప్రాంతాలు సుర‌క్షితంగా ఉన్న‌ట్లు చెప్పారు. 
 
దేశంలోకి భారీ సంఖ్య‌లో ఉగ్ర‌వాదులు ప్రవేశిస్తున్న‌ట్లు కూడా ట్రంప్ ఆరోపించారు. చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే త‌మ పాల‌న స‌మ‌యంలోనే సరిహద్దు సుర‌క్షితంగా ఉంద‌ని, బైడెన్ స‌ర్కారు అన్నింటినీ విస్మ‌రించింద‌ని, సరిహద్దును తెర‌వ‌డం వ‌ల్ల‌.. జైళ్లు, మానసిక కేంద్రాల నుంచి జ‌నం దేశంలోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లు ట్రంప్ ఆరోపించారు. అత్య‌ధిక సంఖ్య‌లో అమెరికాలోకి ఉగ్రవాదులు వ‌స్తున్న‌ట్లు చెప్పారు.
ట్రంప్‌ సర్కార్.. ధనికులకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించడంతో ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయిందని.. నిరుద్యోగం 15 శాతానికి చేరిందని బైడెన్ మండిపడ్డారు. అయితే వాటిని ఖండించిన ట్రంప్.. బైడెన్‌ ప్రభుత్వంలో కేవలం అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ట్రంప్‌ విమర్శించారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని.. ట్యాక్స్ కట్‌ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత దారుణస్థితిని ఎదుర్కొంటోందని ఆరోపించారు.
 
అమెరికా రాజకీయాల్లో వృద్ధనేతలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ ఇరువురు అభ్యర్థుల శారీరక పరిస్థితుల పట్ల ప్రజలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లు కనిపించిందని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంప్‌, బైడెన్‌ ఇద్దరూ ఈ డిబేట్‌ను రియాల్టీ షో స్థాయికి దిగజార్చారని వారు పెదవి విరిచారు. ఈ ఏడాది నవంబర్ 5 వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 
 
అమెరికా ఆర్థిక విధానం, ఇమ్మిగ్రేషన్‌, సరిహద్దు అంశాలు, గర్భస్రావ హక్కులు, విదేశాంగ విధానం, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులు వంటి అంశాలపై సమగ్రమైన చర్చ జరుగుతుందని ఆశించినవారికి నిరాశే మిగిల్చింది. అమెరికా చరిత్రలోనే అత్యంత అధ్వానమైన అధ్యక్షుడు బైడెన్‌ అని ట్రంప్‌ విమర్శించగా, ట్రంప్‌ను దోషి అని బైడెన్‌ విమర్శించారు. 
 
చర్చ సందర్భంగా బైడెన్‌ చాలాచోట్ల మాట్లాడింది అస్పష్టంగా వుండి అర్థం కాలేదు. బైడెన్‌ పనితీరుపై డెమొక్రాట్లు నిరాశ చెందారు. బైడెన్‌ కన్నా ట్రంప్‌ ఎక్కువ సేపు మాట్లాడారు. నేరుగా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో తడబడ్డారు. దీంతో బైడెన్‌ అభ్యర్థిత్వంపై డెమొక్రాట్లు పునరాలోచనలో పడ్డారు. 
 
మొత్తం మీద ఈ చర్చ సమయం వృథా తప్ప మరేమీ కాదని టెలివిజన్‌ వీక్షకులు పలువురు సోషల్‌ మీడియాలో విమర్శించారు. మరోసారి నేతల మధ్య జరిగే ఇలాంటి చర్చల పట్ల అమెరికన్‌ ఓటర్లు ఉత్సాహంగా లేరని పలు పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఇరువురు అభ్యర్ధుల పట్ల కూడా ఓటర్లు వ్యతిరేకతే కలిగి వున్నారు. రెండో చర్చ సెప్టెంబరు 10న జరగనుంది.