మాల్దీవుల అధ్యక్షుడిపై చేతబడి జరిగిందంటూ కలకలం

మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్‌ మొయిజ్జుపై చేతబడి జరిగిందనే ఆరోపణలతో కలకలం రేగుతోంది. దీని వెనుక ఇద్దరు మంత్రుల ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 
 
మాల్దీవుల పర్యావరణ శాఖ సహాయమంత్రి షమ్నాజ్‌ సలీం, ఆమె మాజీ భర్త, అధ్యక్ష కార్యాలయ మంత్రి ఆదం రమీజ్‌‌, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపినట్టు కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఈ అరెస్ట్‌లపై పోలీసులు ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
 
‘‘షమ్నాజ్‌ సలీంతోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశారు.. ఈ ముగ్గురికీ కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది.. ఆమెను మంత్రి పదవి నుంచి బుధవారం తొలగించారు. అలాగే ఆమె మాజీ భర్త రమీజ్‌ను గురువారం మంత్రివర్గం నుంచి తప్పించారు’’ అని మాల్దీవుల వెబ్‌సైట్ సన్.ఎంవీ వివరించింది. 
 
ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మొయిజ్జు మాలె నగర మేయర్‌గా ఉన్నప్పుడు షమ్నాజ్, రమీజ్‌‌లు కౌన్సిలర్లుగా ఉన్నారు. మొయిజ్జుకు ముఖ్య అనుచరుల్లో ఒకరిగా రమీజ్ గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి ఆయనపై చేతబడి చేయించినట్టు కథనాలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, గత ఐదు నెలల నుంచి ఆయన బయట ప్రపంచంలోకి రాలేదు. 

కాగా, ఈ పరిణామాలపై మాల్దీవులు ప్రభుత్వం కానీ, అధ్యక్ష కార్యాలయం కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, మాల్దీవుల్లో చేతబడి నేరం కాదు. కానీ, ఇస్లామిక్ చట్టాల ప్రకారం దోషిగా నిర్దారణ అయితే ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు.
మాల్దీవులకు పర్యావరణ ముప్పు పొంచి ఉందని, ఈ శతాబ్దం చివరి నాటికి దీవులు మునిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
షమ్నాజ్ అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. అయితే, మొయిజ్జును అంతం చేయడానికే చేతబడి ప్రయోగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
చేతబడి సాధారణంగా శారీరకంగా, మానసికంగా లేదా ఆర్థికంగా ఒకరిని నాశనం చేయడానికి ఉద్దేశించిన క్షుద్రపూజలు. ప్రత్యర్థులకు అదృష్టాన్ని లేదా హానిని కలిగిస్తుందని నమ్మే ఈ సాంప్రదాయ మాల్దీవుల్లో సర్వసాధారణం. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. గతేడాది ఒక సీనియర్ సిటిజన్‌పై పక్కింటివారు చేతబడి చేశారనే ఆరోపణలు వచ్చాయి.