అమెరికాలో నాలుగు రేట్లు పెరిగిన తెలుగు జనాభా

అమెరికాలో తెలుగు జనాభా ఏటికేడు పెరుగుతోంది. అక్కడ ఎనిమిదేళ్లలోనే నాలుగు రెట్లు తెలుగు జనాభా పెరిగింది. 2016లో అమెరికాలో 3.2 లక్షల మంది తెలుగు జనాభా వుండగా, 2024 సంవత్సరానికి ఆ సంఖ్య 12.3 లక్షలకు చేరుకుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా సెన్సస్‌ బ్యూరో నివేదిక ప్రకారం కాలిఫోర్నియాలో రెండు లక్షలు, టెక్సాస్‌ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1లక్షల మంది తెలుగువారు ఉన్నారు. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో 83 వేలు, వర్జీనియా 78 వేలు, జార్జియా 52 వేలు మంది తెలుగు వారు ఉన్నారు. దాదాపు 10 వేల మంది హెచ్‌1బి వీసా పొందిన వారితోపాటు ప్రతి సంవత్సరం 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు యుఎస్‌ వెళుతున్నారు.
 
వీరిలో 80 శాతం మంది తమ వద్ద రిజిష్టర్‌ చేయించుకున్నవారేనని ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ కార్యదర్శి అశోక్‌ కొల్లా తెలిపారు. ఇక్కడికి వచ్చిన వారిలో 75 శాతం మంది స్థిరపడ్డారు. ఎక్కువగా డల్లాస్‌, బే ఏరియా, నార్త్‌ కరోలినా, న్యూ జెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్‌విల్లేలో స్థిరపడ్డారు. చాలాఏళ్ల క్రితమే ఇక్కడికొచ్చిన తెలుగు వారు ఐటి, ఫైనాన్స్‌లో స్థిరపడ్డారు.
 
అమెరికాలోని 350 విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉంది. హిందీ, గుజరాతీ భాషల కంటే తెలుగు మాట్లాడేవారే ఎక్కువ. అక్కడ ఎటుచూసినా తెలుగు కుటుంబాలు పలుచోట్ల కనిపిస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తర్వాత అమెరికా తెలుగు వారికి ఇంకో రాష్ట్రంగా మారింది. తెలుగు వారికోసం పలు చోట్ల దేవాలయాలు కూడా వెలిశాయి.