సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్‌ ప్రతీకార విజయం.. ఫైనల్ కు చేరిక

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ గురువారం పలుమార్లు  అంతరాయం మధ్య ఆగుతూ సాగిన మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ భారత్‌ను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో మైదానం చిత్తడిగా మారడంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బట్లర్‌ లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపాడు.

కెప్టెన్‌ రోహిత్‌శర్మ(39 బంతుల్లో 57, 6ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు సూర్యకుమార్‌యాదవ్‌(36 బంతుల్లో 47, 4ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించడంతో టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 171/7 స్కోరు చేసింది. 

మిడిలార్డర్‌లో హార్దిక్‌పాండ్యా(23) ఫర్వాలేదపించగా, దూబే(0), పంత్‌(4), కోహ్లీ(9) ఘోరంగా నిరాశపరిచారు. క్రిస్‌ జోర్డాన్‌(3/37)కు మూడు వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనలో స్నిన్నర్లు అక్షర్‌పటేల్‌(3/14), కుల్దీప్‌యాదవ్‌(3/19) ధాటికి ఇంగ్లండ్‌ 16.4 ఓవర్లలో 103 పరుగులకు కుప్పకూలింది. అక్షర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

హిట్‌మ్యాన్‌ రోహిత్‌..మెగాటోర్నీలో తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఓవైపు విరాట్‌ కోహ్లీ వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతున్న వేళ..నాయకునిగా జట్టు బ్యాటింగ్‌ భారాన్ని భుజాన వేసుకున్నాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీగా మలిచిన రోహిత్‌..ఎక్కడా వెనుకకు తగ్గలేదు.  మరో ఎండ్‌లో టోప్లె బౌలింగ్‌లో కండ్లు చెదిరే సిక్స్‌తో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన కోహ్లీ ఆ మరుసటి బంతికే క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పంత్‌ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. భారీ షాట్‌ ఆడబోయిన పంత్‌..బెయిర్‌స్టో క్యాచ్‌తో ఔటయ్యాడు. 

ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా..రోహిత్‌ తన జోరు తగ్గించలేదు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి భారత్‌ 46/2 స్కోరు చేసింది. బౌలర్‌ ఎవరన్నది లెక్కచేయని నైజంతో హిట్‌మ్యాన్‌ బౌండరీలతో చెలరేగడంతో స్కోరు ఊపందుకుంది. మరోవైపు సూర్యకుమార్‌ కూడా బ్యాటు ఝులిపించడంతో పరుగుల రాక సులువైంది. కరాన్‌ 13వ ఓవర్‌లో సూపర్‌ సిక్స్‌తో రోహిత్‌ 36 బంతుల్లో రోహిత్‌ అర్ధసెంచరీ మార్క్‌ అందుకుంది. అయితే మరుసటి ఓవర్‌లోనే కెప్టెన్‌ రషీద్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఔటయ్యాడు. 

దీంతో మూడో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. అదే దూకుడు కొనసాగిస్తాడనుకున్న సూర్యకుమార్‌ కూడా రోహిత్‌ను అనుసరించడంతో ఒకింత మందగించింది. ఆఖర్లో పాండ్యా, జడేజా బ్యాటింగ్‌తో భారత్‌ పోరాడే స్కోరు అందుకుంది.  లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ దూకుడు కనబరిచేందుకు ప్రయత్నించింది. అర్ష్‌దీప్‌సింగ్‌ వేసిన మూడో ఓవర్లో బట్లర్‌ మూడు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. బౌలింగ్‌ మార్పుగా వచ్చిన అక్షర్‌పటేల్‌ తొలి బంతికే బట్లర్‌ను బోల్తా కొట్టించాడు. 

షాట్‌ ఆడే క్రమంలో కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇక్కణ్నుంచి ఇంగ్లండ్‌ స్పిన్‌ ఉచ్చులో చిక్కుకుంది. సాల్ట్‌(5)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్‌ చేయగా, బెయిర్‌స్టో(0)ను అక్షర్‌..డకౌట్‌గా పెవిలియన్‌ పంపాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఇంగ్లండ్‌ 39/3 చేసింది.

అప్పటికే పిచ్‌పై పూర్తి అవగాహనకు వచ్చిన కెప్టెన్‌ రోహిత్‌..స్పిన్నర్లతో ఇంగ్లండ్‌ పనిపట్టాడు. మరో ఎండ్‌లో కుల్దీప్‌ చెలరేగడంతో మొయిన్‌ అలీ(8), కరాన్‌(2), బ్రూక్‌, జోర్డాన్‌(1) వెంటవెంటనే నిష్క్రమించారు. స్పిన్నర్ల విజృంభణతో ఇంగ్లండ్‌ బ్యాటర్లు కనీసం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆర్చర్‌తో సమన్వయ లోపంతో లివింగ్‌స్టోన్‌(11), రషీద్‌(2) రనౌట్‌ అయ్యార్‌. ఆర్చర్‌(21) పోరాడినా ఫలితం లేకపోయింది.

సంక్షిప్త స్కోర్లు
భారత్‌: 20 ఓవర్లలో 171/7(రోహిత్‌ 57, సూర్యకుమార్‌ 47, జోర్డాన్‌ 3/37, రషీద్‌ 1/25). ఇంగ్లండ్‌: 16.4 ఓవర్లలో 103 ఆలౌట్‌(బ్రూక్‌ 25, బట్లర్‌ 23, కుల్దీప్‌ 3/19, అక్షర్‌పటేల్‌ 3/23)