జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ విడుదల

భూ కుంభకోణం కేసులో అరెస్టయిన జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శుక్రవారం రాంచీలోని బిర్సా ముండా జైలు నుంచి విడుదలయ్యారు. జార్ఖండ్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో అయిదు నెలల జైలు జీవితం అనంతరం ఆయన బయటకువచ్చారు. భార్య కల్పనా సోరెన్ వెంటరాగా హేమంత్ సోరెన్‌ జైలు నుంచి బయటకు వస్తూ జేఎంఎం కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు.

ఇక భూ కుంభకోణం కేసులో జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు జార్ఖండ్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఆయన భార్య కల్పనా సోరెన్‌ స్వాగతించారు. ఎన్నో నెలల తర్వాత సంతోషకరమైన రోజు ఎదురైందని హర్షం వ్యక్తం చేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు హేమంత్‌ సోరెన్‌కు బెయిల్ లభించడంపై కాంగ్రెస్‌ నేత అంబా ప్రసాద్‌ స్పందిస్తూ సోరెన్‌ అమాయకుడని తమకు తెలుసని, ఆయన రాక తమ బృందానికి మరింత బలం ఇస్తుందని చెప్పారు. ప్రతికూల పరిస్ధితుల్లోనూ జార్ఖండ్‌ ప్రభుత్వం నిబ్బరంతో పనిచేసిందని పేర్కొన్నారు. 

జార్ఖండ్‌ ముఖ్యంమత్రిగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జనవరి 31న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సొరేన్‌ సమాధానం దాటవేస్తున్న క్రమంలో మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. 

అప్పటి నుంచి జైల్లోనే ఉన్న ఆయన దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చారు. కాగా, అరెస్ట్‌ అనంతరం సోరెన్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌ బాధ్యతలు చేపట్టారు.