వైసిపి మాజీ ఎంపీ ఎంవివికి హైకోర్టులో చుక్కెదురు

విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హయగ్రీవ సంస్థకు చెందిన భూముల ఆక్రమణ ఆరోపణలపై  విశాఖపట్నం ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుల వ్యవహారంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ దశలోనే ఉందని, అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు తెలిపింది. 
 
అవసరమైతే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచిస్తూ  విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు. హయగ్రీవ ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన సీహెచ్‌ జగదీశ్వరుడు ఆరిలోవ పోలీసులకు మాజీ ఎంపీ సత్యనారాయణతో పాటు  ఆడిటర్‌ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), గాదె బ్రహ్మాజీలపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని తమ విలువైన భూములు కాజేసేందుకు ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. దీంతో ఈ కేసును కొట్టేయాలని మాజీ ఎంపీ ఎంవీవీ హైకోర్టును ఆశ్రయించారు.  తనను, తన భార్యను బెదిరించి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకుని తనకు చెందిన భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ హయగ్రీవ ఫర్మ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ ‘భాగస్వామి’ సీహెచ్‌ జగదీశ్వరుడు అలియాస్‌ జగదీశ్‌ (64) తన ఫిర్యాదులో తెలిపారు. 
 
బాధితుని కథనం ప్రకారం, వృద్ధుల కోసం అనాథ ఆశ్రమం, వారికి విల్లాలు నిర్మించి తక్కువ ధరకే విక్రయించేందుకు వీలుగా తనకు నామమాత్రపు ధరకు భూమిని కేటాయించాలంటూ జగదీశ్‌ 2006లో రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2008లో ఎండాడ సర్వే నంబర్‌ 93/3లోని 12.51 ఎకరాల భూమిని ఆయనకు కేటాయించింది. ఆ భూమికి ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఆయన చెల్లించారు. 
 
తనతోపాటు భార్య రాధారాణి ప్రొప్రయిటర్‌గా ఉన్న హయగ్రీవ ఫర్మ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ పేరుతో 2010లో దాన్ని రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. జగదీశ్‌కు ఇచ్చిన భూమిలో 2020 వరకూ నిర్మాణాలు చేపట్టని విషయం వారు తెలుసుకున్నారు.  అప్పుడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆ పార్టీ విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ, ఇతరులు.. ఆ భూమిలో డెవల్‌పమెంట్‌ కోసం 2020లో జగదీశ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ సమయంలో ఎంవీవీ, జీవీ, బ్రహ్మాజీ కలిసి తనతోపాటు తన భార్య రాధారాణి సంతకాలను ఫోర్జరీ చేయడంతోపాటు కొన్ని ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని బాధితుడు ఆరోపించారు.  వాటి ఆధారంగా ప్రభుత్వం నుంచి పొందిన 12.51 ఎకరాల భూమిని కబ్జా చేశారని వాపోయారు. దీనిపై ప్రశ్నించిన తమను చంపేస్తామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.