ఓం బిర్లా ఎమర్జెన్సీ ప్రస్తావనతో లోక్ సభలో కలకలం

పద్దెనిమిదవ లోక్‌సభ స్పీకర్‌గా బుధవారంనాడు ఎన్నికైన ఓం బిర్లా తొలి ప్రసంగంలోనే 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తో పాటు విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే బిజెపి సభ్యులు సభ వాయిదా పడినతర్వాత బయట ప్లేకార్డులు పట్టుకొని ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 
ఎమర్జెన్సీని ప్రస్తావించినందుకు స్పీకర్ ను ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. నాటి అత్యవసర పరిస్థితి చరిత్రలోనే బ్లాక్ ఛాప్టర్‌గా నిలిచిపోతుందని స్పీకర్ పేర్కొన్నారు. 1975లో విధించిన ఎమర్జెన్సీ నిర్ణయాన్ని లోక్‌సభ ఖండిస్తోందని చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మృత్యర్థం రెండు నిమిషాల మౌనాన్ని ఆయన పాటించారు.

”1975 నాటి ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడిన వారందరినీ సభ అభినందిస్తోంది. భారతదేశ చరిత్రలో 1975 జూన్ 25వ తేదీ బ్లాక్‌డేగా నిలిచిపోతుంది. ఆరోజు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థఇతి విధించి, బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంపై దాడి చేశారు” అని ఓం బిర్లా లోక్‌సభలో చేసిన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. 

దేశ ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కి, భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతు నులిమారని విమర్శించానరు. ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిదనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసునని, ప్రజాస్వామ్య విలువలు, దానిపై చర్చకు ఇండియా ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. వాటి పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు.

“కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా చేసిన రాజ్యాంగ సవరణల లక్ష్యం మొత్తం అధికారాన్ని ఒక వ్యక్తికి తీసుకురావడం, న్యాయవ్యవస్థను నియంత్రించడం,  రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను తొలగించడం. ఇలా చేయడం ద్వారా పౌరుల హక్కులను అణిచివేసారు మరియు ప్రజాస్వామ్య సూత్రాలపై దాడి చేశారు” అని ఓం బిర్లా తెలిపారు. 
 
“ఇదొక్కటే కాదు, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నిబద్ధతతో కూడిన బ్యూరోక్రసీ, నిబద్ధతతో కూడిన న్యాయవ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. ఇది ఆమె ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి ఉదాహరణ. ఎమర్జెన్సీ తనతో పాటు సామాజిక వ్యతిరేక, నియంతృత్వ స్ఫూర్తితో నిండిన భయంకరమైన విధానాలను తీసుకువచ్చింది” అంటూ బిర్లా విమర్శించారు. 
 
 ఎమర్జెన్సీ సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిర్బంధ స్టెరిలైజేషన్, నగరాల్లో ఆక్రమణల తొలగింపు పేరుతో నిరంకుశత్వం, ప్రభుత్వ దుర్మార్గపు విధానాల వల్ల ప్రజలు చాలా బాధలు అనుభవించాల్సి వచ్చిందని, ఈ సభ ప్రజలందరికీ తన సంతాపాన్ని తెలియజేస్తుందని స్పీకర్ తెలిపారు.
 
లోక్‌సభలో ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.“గౌరవనీయ స్పీకర్ ఎమర్జెన్సీని తీవ్రంగా ఖండించినందుకు నేను సంతోషిస్తున్నాను, ఆ సమయంలో చేసిన అతిక్రమణలను ఎత్తిచూపారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కబడిన విధానాన్ని కూడా ప్రస్తావించారు” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
 
ఆ రోజుల్లో బాధపడ్డ వారందరికీ గౌరవంగా మౌనంగా నిలబడడం కూడా అద్భుతమైన సంజ్ఞ అని ఆయన కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన సంఘటనలు నియంతృత్వం ఎలా ఉంటుందో ఉదాహరణగా ప్రధాని చెప్పుకొచ్చారు.