ఆగిపోయిన అమరావతి పనులు ప్రారంభించండి

రాజధాని అమరావతిలో అగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎల్‌అండ్‌టి ప్రతినిధులను కోరారు. ఎల్‌ అండ్‌టి సంస్థ గతంలో రాజధాని ప్రాంతంలో కొన్ని పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. రాజధానిలో కీలకమైన అమరావతి గవర్నమెంటు కాంప్లెక్స్‌ పనులను ఎల్‌అండ్‌టి చేపట్టింది. 
 
మరికొన్ని కీలక పనులను షాపూర్‌జీ, పల్లోంజి, ఎన్‌సిసి, మేఘా సంస్థలు కూడా చేశాయి. రాజధాని నిర్మాణాన్ని ప్రాధ్యాన్యతగా తీసుకున్న నేపథ్యంలో గతంలో పనులు నిర్వహించిన సంస్థలతో ఒక్కోరోజు ఒక్కో సంస్థతో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు. 
 
దీనిలో భాగంగా తొలిరోజైన శుక్రవారం ఎల్‌అండ్‌టి సంస్థ ప్రతినిధులతో సమావేశమైన ఆయన గతంలో వారు చెపట్టిన పనులు, ఎంతవరకూ పూర్తయ్యాయి? మరలా పనులు చేపట్టాలంటే ప్రభుత్వం చేయాల్సిందేమిటి? తదితర అంశాలపై వారితో మాట్లాడారు. 
 
బిల్లుల పెండింగ్‌ వంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిస్థితి ఏమిటి? గత ఐదేళ్లలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? తదితర అంశాలను వారితో చర్చించారు. దీనిపై స్పందించిన ఎల్‌అండ్‌టి సంస్థ ప్రతినిధులు తమకు గతంలో కొంత నిధులు పెండింగ్‌ ఉన్నాయని, కొన్ని యంత్రాలు వదిలేశామని, కొంత నష్టం వాటిల్లిందని తెలిపారు. 
 
దీనిపై స్పందించిన సిఎం తామేమీ చేయాలని మీరు కోరుకుంటున్నారో చెప్పాలని అడిగారు. దీనిపై వారు మాట్లాడుతూ పనులు చేయడానికి అభ్యంతరం లేదని, కానీ బిల్లులు వెంటనే వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని, ఇతర అంశాలపై అధికారులతో చర్చించి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూస్తానని చెప్పినట్లు తెలిసింది. 
 
ఎల్‌అండ్‌టి సంస్థ అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ (ఎజిసి)తోపాటు, ఉద్యోగుల నివాసాల నిర్మాణాన్ని చేపట్టింది. వీటిల్లో ఉద్యోగుల నివాసాలు దాదాపు పూర్తయ్యేదశలో ఉండగా వైసిపి ప్రభుత్వం పనులు నిలిపేసింది.