ప్రపంచ కప్ సెమీస్ చేరిన భారత్.. ఆస్ట్రేలియాపై ప్రతీకార విజయం

ప్రపంచ కప్ సెమీస్ చేరిన భారత్.. ఆస్ట్రేలియాపై ప్రతీకార విజయం
ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకార విజయం సాధించింది.  గత రెండు ఐసీసీ టోర్నీ (డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌)లలో భారత ‘కప్పు కల’ను అడ్డుకున్న ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా బదులు తీర్చుకుంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే ఆ జట్టుకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో కంగారూలను 24 పరుగుల తేడాతో ఓడించింది. 
 
సెయింట్‌లూసియా వేదికగా ఇరు జట్ల మధ్య సాగిన ‘హై స్కోరింగ్‌ థ్రిల్లర్‌’లో  టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్1 సూపర్-8 మ్యాచ్‍లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‍ల్లో భారత్ సెమీస్ చేరడం ఇది ఐదోసారి. అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్‌ నిలిచింది.
 
అలాగే, సూపర్ 8లో మూడింట మూడు గెలిచి సెమీఫైనల్‍కు టీమిండియా దూసుకెళ్లింది.  చాలాకాలం తర్వాత భారత సారథి రోహిత్‌ శర్మ (41 బంతుల్లో 92, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) తనలోని ‘హిట్‌మ్యాన్‌’ను బయటకు తీసి ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడటంతో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.
 
సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 31, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 27 నాటౌట్‌, 1 ఫోర్‌, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. భారీ ఛేదనలో ఆస్ట్రేలియా దీటుగానే బదులిచ్చింది. ట్రావిస్‌ హెడ్‌ (43 బంతుల్లో 76, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి భారత్‌ పాలిట విలన్‌గా మారినా చివర్లో మన బౌలర్లు రాణించి ఆసీస్‌ను దెబ్బకొట్టడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 181/7కే పరిమితమైంది. రోహిత్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

206 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (43 బంతుల్లో 76 పరుగులు; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) దుమ్మురేపాడు. దూకుడైన ఆటతో రాణించాడు. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో టీమిండియాకు దెబ్బేసిన హెడ్ మరోసారి టెన్షన్ పెట్టాడు. అయితే, 17వ ఓవర్ వరకు పోరాడిన హెడ్‍ను భారత పేసర్ బుమ్రా ఔట్ చేశాడు. 

మొత్తంగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ (6)ను భారత పేసర్ అర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు. ఆ తర్వాత హెడ్ దూకుడు చూపాడు. హెడ్ అదరగొడుతుండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 37 పరుగులు; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతడికి జత కలిశాడు. ఇద్దరూ దూకుడుగా ఆడారు. 

అయితే, 9వ ఓవర్లో కుల్దీప్ బౌలింగ్‍లో అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మార్ష్ ఔటయ్యాడు. దీంతో 84 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోగా మ్యాచ్ మలుపు తిరిగింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఓ దశలో ఆసీస్ గెలిచేలా కనిపించినా.. క్రమంగా కట్టడి చేశారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (20) కాసేపు మెరిపించినా ఎక్కువసేపు నిలువలేకపోయాడు.

మార్కస్ స్టొయినిస్ (2) విఫమయ్యాడు. అయితే, హెడ్ మాత్రం పోరాడుతూ వచ్చాడు. 17వ ఓవర్లో హెడ్‍ను బుమ్రా ఔట్ చేయడంతో ఆసీస్ ఆశలు ముగిశాయి. టిమ్ డేవిడ్ (15), మాథ్యూ వేడ్ (1) సహా తర్వాతి బ్యాటర్లు రాణించలేదు.

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. జస్‍ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు. టీమిండియా ప్లేయర్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‍లో సూపర్ క్యాచ్ పట్టాడు. 9వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‍లో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ భారీ షాట్ కొట్టగా.. డీప్ మిడ్ వికెట్ బౌండరీ దగ్గర ఎగిరి ఒక్కో చేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు అక్షర్. 

బౌండరీ లైన్‍కు తగలకుండా జంప్ చేశాడు. సిక్స్ వెళ్లే బంతిని క్యాచ్‍గా మలిచాడు అక్షర్. 87 పరుగులకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆసీస్ పటిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు మార్ష్ క్యాచ్ పట్టి మ్యాచ్‍ను టర్న్ చేశాడు అక్షర్ పటేల్.