ఎమర్జెన్సీ విధించే మనస్తత్వం కాంగ్రెస్‌లో సజీవం

ఎమర్జెన్సీ విధించే మనస్తత్వం కాంగ్రెస్‌లో సజీవం
ఇందిరా గాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు అయినా సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ హస్తం పార్టీ చేస్తోన్న ఆరోపణలకు ఈ సందర్భంగా మోదీ గట్టిగా బదులిచ్చారు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి దేశాన్ని జైలుగా మార్చేసిందని విమర్శించారు. 
 
ఎమర్జెన్సీ విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. 
‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను, ప్రతి భారతీయుడూ గౌరవించే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తుంగలో తొక్కింది’ అంటూ విమర్శించారు. 
 
`కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైల్లో పెట్టింది. ఆ పార్టీని వ్యతిరేకించిన వారిని హింసించారు. బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారు’ అంటూ చెప్పుకొచ్చారు. `ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే నైతిక హక్కు లేదు. ఎమర్జెన్సీ విధించిన పార్టీయే లెక్కలేనన్ని సందర్భాలలో ఆర్టికల్ 356ను విధించింది. పత్రికా స్వేచ్ఛను నాశనం చేసే ఎన్నో బిల్లులను తెచ్చారు. ఫెడరల్‌ వ్యవస్థను నాశనం చేశారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారు’ అని గుర్తు చేశారు.

 కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎమర్జెన్సీ మనస్తత్వం సజీవంగా ఉందని, రాజ్యాంగంపై వారికి ఉన్న అయిష్టాన్ని దాచిపెట్టి ఇప్పుడు నటిస్తున్నారని ప్రధాని ధ్వజమెత్తారు. అయితే, వారి ప్రవర్తనను ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే పదేపదే కాంగ్రెస్‌ పార్టీని తిరస్కరిస్తున్నారని మోదీ చురకలు అంటించారు.