కల్తీ మద్యంతో దళితులు మరణిస్తుంటే నోరు మెదపరే!

తమిళనాడు కల్తీ సారా ఘటనలో 50 మందికిపైగా మరణించిన ఘటనపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కళ్లకురుచిలో జరిగిన ఈ ఘటనలో 200 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరి పరిస్ధితి విషమంగా ఉందని ఆమె చెప్పారు.  ఈ ఘటనలో ఇప్పటికే 56 మంది మరణించారని, వీరిలో అధికులు షెడ్యూల్డ్‌ కులాల వారే అని ఆమె పేర్కొన్నారు. 
 
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె తెలిపారు. అయితే కల్తీ సారా ఘటనపై కాంగ్రెస్‌ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ప్రభుత్వం నిర్వహించే షాపుల్లో కళ్లకురుచిలో బాహాటంగా కల్తీ మద్యం, నాటు సారా విక్రయిస్తుంటే డీఎంకే సర్కార్‌కు మద్దతిస్తున్న కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ, అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్కడున్నారని ఆమె నిలదీశారు.  కల్తీ మద్యంతో దళితులు మరణిస్తుంటే రాహుల్‌ గాంధీ నోరు మెదపడం లేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు.

కాగా, హూచ్ దుర్ఘటనలో మృతుల సంఖ్య 56కి చేరిందని జిల్లా యంత్రాంగం ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నాలుగు వేర్వేరు ఆసుపత్రుల్లో 216 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కల్లకురిచ్చి జిల్లాలోని కల్తీ సారా సరఫరా కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు.

జిల్లాలోని కరుణాపురం గ్రామానికి చిన్నదురై అనే వ్యక్తి కల్తీ లిక్కర్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ప్రతి రోజూ గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయని, మరికొంత మంది పలు హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు.రిటైర్డ్‌‌ జస్టిస్‌‌ గోకుల్‌‌దాస్‌‌ కమిషన్‌‌ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. మరో మూడు నెలల్లో సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందించనున్నారు. 

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేయగా, కలెక్టర్‌‌‌‌ను బదిలీ చేసింది. రాష్ట్రంలో అక్రమ మద్యంపై ఉక్కు పాదం మోపుతానని ముఖ్యమంత్రి స్టాలిన్‌‌ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ స్టాలిన్‌‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌‌ చేస్తున్నాయి.