హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణకు యత్నంతో ఉద్రిక్తత

హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణకు యత్నంతో ఉద్రిక్తత
మియాపూర్‌లోని హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించిన నేపథ్యంలో దీప్తిశ్రీనగర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. మదీనాగూడలోని సర్వే నంబర్‌.100, 101లో ఉన్న స్థలంలో ఇళ్లు లేదా పట్టాలు ఇవ్వాలని ఆక్రమణదారులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ స్థలంలోకి ఎవర్నీ అనుమతించడం లేదు. 
 
కాగా, నిన్నటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మియాపూర్‌, చందానగర్‌ పీఎస్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధిస్తూ సైబరాబాద్‌ సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలు ఉంటుందని పేర్కొన్నారు.  ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. పేద ప్రజలు హెచ్‌ఎండీఏ భూములను ఆక్రమించేందుకు శనివారం యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. 
 
మియాపూర్‌లోని మదీనాగూడలో హెచ్‌ఎండీఏకు ప్రభుత్వ కేటాయించిన సర్వే నంబర్‌ 100,101లలో సుమారు 450 ఎకరాల దాకా స్థలం ఉన్నది. దాన్ని ఎప్పటి నుంచో కబ్జా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నా.. హెచ్‌ఎండీఏ అడ్డుకుంటోంది. ఈ భూముల్లో పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తున్నారంటూ ప్రచారం జరగటంతో నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.శుక్రవారం నుంచే వేలాది మంది హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉన్న భూముల్లోకి వచ్చి తమకు స్థలాలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. భూములను ఆక్రమిస్తున్నారని ఆలస్యంగా తెలుసుకున్న హెచ్‌ఎండీఏ అధికారులు.. స్థానిక పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా.. వినకుండా అక్కడే ప్రజలు కూర్చిండిపోయారు. 

దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా..కదలలేదు. పైగా రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. పెద్ద ఎత్తున మొహరించిన పోలీసు బలగాలు అక్కడి నుంచి ప్రజలను పంపించేందుకు ప్రయత్నం చేసినా, వారి నుంచి ఎదురు దాడి ఎదురైంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయి. హెచ్‌ఎండీఏ స్థలంలోకి వచ్చిన వారికి పోలీసులు ఎంతో ప్రశాంతంగా స్థలాన్ని విడిచివెళ్లిపోవాలని చెప్పారు. అది విని కొందరు వెళ్లిపోయారు. అయినా ఇంకా చాలా మంది స్థలంలో ఉండి మాకు స్థలాలు కావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.