
రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, గ్రూప్స్ రాసే అభ్యర్థుల పట్ల ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేయాలని, గ్రూప్స్ రాసే అభ్యర్థుల డిమాండ్లను నెరవేర్చలని కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు రాష్ట్ర బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ల మహేందర్ నేతృత్వంలో శనివారం ముట్టడి చేశారు.
ఈ సందర్భంగా బీజేవైఎం నేతల ను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు బీజేవైఎం నేతల మధ్య తీవ్ర ఘర్షణ, తోపులాట జరిగింది. విచక్షణ రహితంగా బీజేవైఎం నేతలను పోలీసులు ఈడ్చివేసుకొంటూ తీసుకెళ్లారు. పోలీసులతో ఘర్షణలో బీజేవైఎం నేతలు మహేష్, అనీత రెడ్డి, సహా పలువురు నేతలు గాయపడ్డారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ల మహేందర్ మాట్లాడుతూ విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపిచ్చారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితమయ్యాడు తప్ప చేతులకు కాదన్న సంగతి తేటతెల్లమైందని విమర్శించారు.
అధికారం కోసం ఆరాటపడ్డ రేవంత్ రెడ్డి అందలమెక్కి అందరికీ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందర్నీ విస్మరిస్తూ పాలిస్తుందని చెబుతూ ఇప్పటికైనా వెంటనే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఐటి మంత్రి శ్రీధర్ బాబు గ్రూప్ 1 అభ్యర్థుల 1:100 విషయంలో మాట్లాడిన విధానాన్ని ఖండించారు. కాబట్టి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ 1:100 ప్రకారం క్వాలిఫై చెయ్యాలని, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలని కోరారు. అలాగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పదేపదే చెప్పిన జాబ్ క్యాలెండర్ ని వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు లేని పక్షంలో బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆందోళనలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
పోలీసుల తోపులాటలో గాయపడి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం నాయకులను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. డాక్టర్లతో ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి తెలుసుకున్న మహేశ్వర్ రెడ్డి వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బీజేవైఎం నాయకులపై పోలీసుల దాడిని ఖండించారు. మహిళలను కూడా చూడకుండా పోలీసులు దాడి చేయడం సరికాదని విమర్శించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి