ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం శుక్రవారం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది.  టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేయగా, గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 

మరోవైపు చింతకాయల అయ్యన్నపాత్రుడు తరుఫున ఉపముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు సాయంత్రం వరకూ గడువు ఉండగా గడువులోగా అయ్యన్న నామినేషన్ ఒక్కటే దాఖలైంది. 

శనివారం చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే ఉన్నారు. 1983లో తొలిసారిగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇప్పటి వరకూ ఏడుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ మీద విజయం సాధించారు. 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు..ఎన్టీఆర్‌, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తన రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎంపీగానూ పనిచేసిన అయ్యన్నపాత్రుడు ఇప్పుడు స్పీకర్ పదవిని అలంకరించనున్నారు.

మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్ర వాసులనే వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా తమ్మినేని సీతారాం వ్యవహరించారు. తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ప్రాతినిధ్యం వహించారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పదవి ప్రమాణ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూసానని, ప్రస్తుతం స్పీకర్‌ పదవి దక్కడం అరుదైన విషయమని చెప్పారు. 1983లో రాజకీయంలోకి ప్రవేశించానని, ఈ 42 ఏళ్ల ప్రయాణంలో పలుమార్లు మంత్రి పదవులను అలంకరించానని పేర్కొన్నారు.

తనకు గౌరవమైన పోస్టు ఇచ్చినందుకు గౌరవంగా మెలుగుతానని వెల్లడించారు. స్పీకర్‌ సీటులో కూర్చున తరువాత పార్టీ గుర్తుకు రావొద్దని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ తాము అందరినీ గౌరవవిస్తామని స్పష్టం చేశారు. సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తానని, అవసరమైనే వారికి శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. ప్రజలు తమకు పదవులు ఇవ్వలేదని, బాధ్యత ఇచ్చారని, ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతానని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.