కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీక‌ర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్ర‌వారం ఉద‌యం పోచారం ఇంటికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ ఆయ‌న‌ను కాంగ్రెస్‌లో చేరాల‌ని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానం పట్ల పోచారం సానుకూలంగా స్పందించడంతో, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయ‌న కుమారుడు భాస్క‌ర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి, భాస్క‌ర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా క‌ప్పారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం సూచ‌న‌ల‌కు త‌ప్ప‌కుండా ప్రాధాన్య‌త ఇస్తాం. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని తెలిపారు. రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నో సేవ‌లందించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి భ‌విష్య‌త్‌లో స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

అనంత‌రం పోచారం మాట్లాడుతూ.. రైతు బిడ్డ‌ను కాబ‌ట్టి.. వ్య‌వ‌సాయంతో ఉన్న‌టువంటి అనుబంధం తెలుసు కాబ‌ట్టి వారు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు అండ‌గా ఉండాల‌ని, రైతులు బాగుప‌డాల‌ని, వారి క‌ష్టాలు తీరాల‌ని ఉద్దేశంతో రేవంత్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. కొన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. వాటిని అధిగ‌మిస్తూ ముందుకు వెళ్తున్నారు అంటూ రేవంత్  కేబినెట్‌ను అభినందించారు. 

“నా జీవితంలో రాజ‌కీయంగా ఆశించేది ఏం లేదు. రైతుల‌తో పాటు వ్య‌వ‌సాయం బాగుండాలి. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌గ‌తిలో చేదోడు వాదోడుగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను” అని పోచారం తెలిపారు.

“టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి టీఆర్ఎస్‌లో చేరాను. కాంగ్రెస్ పార్టీతోనే నా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. మ‌ళ్లీ చివ‌ర‌గా రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. రేవంత్ కార్య‌క్ర‌మాలు న‌చ్చి వారి నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చాల‌ని కాంగ్రెస పార్టీలో చేరాను. రైతుల సంక్షేమాన్ని మాత్ర‌మే నేను కోరుకుంటున్నాను” అని చెప్పారు.