రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు

రెండున్నరేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎమ్యెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్‌ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవసభలో అడుగుపెడతానని ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు.

“సీఎం అయ్యాకే మళ్లీ సభకు వస్తాను, నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇదొక కౌరవ సభ. ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకో నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అవమానాన్ని అందరూ అర్థం చేసుకుని నిండు మనస్సుతో ఆశీర్వదించమని కోరుతున్నాను” ఆంధ్రప్రదేశ్​ శాసనసభలో జరిగిన అవమానంపై అప్పట్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.

2021 నవంబర్​ 19న  చంద్రబాబు తన సతీమణిని అవమానించి మాట్లాడటంతో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. కౌరవ సభను గౌరవ సభగా చేసి తిరిగి ముఖ్యమంత్రిగా ఈ సభలో అడగు పెడతానని చంద్రబాబు శపథం చేసి వెళ్లిపోయారు.

వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమై బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నాడు సభనుంచి ఆవేదనతో బయటకు వెళ్లిన చంద్రబాబు, నాటి శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాలుగోసారి సీఎంగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు వచ్చారు.

16వ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ముందు వెంకటపాలెంలో చంద్రబాబు, టిడిపి ఎమ్యెల్యేలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ముందుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.