ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్లచే బలవంతంగా రాజీనామాలు చేయించి రాజకీయంగా లబ్దిపొందేందుకు యత్నించిన వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు సుమారు లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారిలో చాలామంది వైసీపీకి, వైఎస్ జగన్ తరుఫున ప్రచారం చేశారు. అయితే ఊహించిన విధంగా ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలయ్యింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో రాజీనామా చేసిన వలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటుగా, గౌరవ వేతనం పదివేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ చెప్తోంది. దీంతో ఇప్పటికే వలంటీర్లుగా పనిచేస్తున్నవారు తమను ఉంచుతారో ఉంచరో అని టెన్షన్‌లో ఉండగా.. ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వలంటీర్ల బాధ మరో రకంగా ఉంది.
ఈ సందర్భంగా నెల్లూరులో వైసీపీ నాయకులపై వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి నెల్లూరు జిల్లా చిన్నబజారు పోలీసు స్టేషన్‌లోనూ మరికొందరు వాలంటీర్లు స్థానిక కార్పొరేటర్, వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు బలవంతంగా రాజీనామా చేయించారని వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా మీటింగ్ పేరు చెప్పి రాజీనామా చేయించారని ఆరోపించారు.
పలుచోట్ల వలంటీర్లు స్థానిక ఎమ్మెల్యేలను కలిసి తమను ఉద్యోగం నుంచి తొలగించివద్దని విన్నపాలు అందజేస్తున్నారు. వైసీపీ ఒత్తిళ్ల వళ్ల లక్ష 8వేల మంది వరకు వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజీనామా చేసిన వారిని ఉద్యోగంలోకి తీసుకోబోమని వార్తలు వస్తుండడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు.
ఎలాగైనా తామే అధికారంలోకి వస్తామని వలంటీర్లను బలి చేశారని ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం లక్ష 25 వేల మంది వలంటీర్లను నియమించి వారితో పలు సామాజిక పింఛన్ల పంపిణీతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించి వారికి గౌరవ వేతనం అందిస్తూ వచ్చింది.
మరోవంక, రాజీనామా చేసిన వలంటీర్ల పోస్టులు తమకు ఇప్పించాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల నుంచి కూడా నాయకులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తుంది. వలంటీర్ల కోసం ప్రత్యేకంగా మంత్రిని నియమించడంతో పాటుగా, గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతారన్న వార్తల మధ్య ఉన్న ఉద్యోగం నిలుపుకోవడానికి ప్రస్తుత వలంటీర్లు, రాజీనామా చేసి పోగొట్టుకున్నదాన్ని మళ్లీ పొందేందుకు పాత వలంటీర్లు.. తమకు వాలంటీర్ పదవులు ఇవ్వాలంటూ అధికార పార్టీల కార్యకర్తలు.. మధ్య ప్రభుత్వ వైఖరి ఆసక్తికరంగా మారనుంది.
ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సచివాలయాలు, వలంటీర్ల శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడించారు. వైసిపి నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని, తమ జీవితాలతో ఆడుకున్నారని వలంటీర్లు తన ఫోన్‌కు వాట్సప్ మెసేజ్‌లు పంపించారని చెప్పారు.
వలంటీర్లతో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేస్తామని పేర్కొంటూ వచ్చే ఒకటో తేదీన పింఛనుదారులకు రూ.7 వేలను వారి ఇంటి వద్దే అందిస్తామని తెలిపారు. అయితే, రాజీనామాలు చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో మాత్రమే పని చేయించుకుంటామని, ఉద్యోగాలకు రాజీనామా చేసిన వలంటీర్లను తిరిగి తీసుకోమని మంత్రి స్పష్టం చేశారు.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?
ఏఐతో డీప్ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా