ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లపై మోజు ఆత్మహత్యా సదృశమే

ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లపై మోజు ఆత్మహత్యా సదృశమే
సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేనప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ల వైపు ఆకర్షితులవుతున్నారని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్సీఈఆర్టీ) డైరెక్టర్‌ దినేష్ ప్రసాద్ సక్లానీ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లోనూ నాణ్యమైన విద్య అందుతున్న ప్రస్తుత తరుణంలో ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లపై మక్కువ పెంచుకోవడం అంటే ఆత్మహత్యకు తక్కువేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. 
 
తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమ పాఠశాలలపై మక్కువ పెంచుకుంటున్నారని, తగినంత మంది ఉపాధ్యాయులు లేకున్నా, సరైన శిక్షణ లేకున్నా తమ పిల్లలను అలాంటి పాఠశాలలకు పంపేందుకు వారు ఇష్టపడుతున్నారని ఆయన విమర్శించారు. ఆత్మహత్యకు ఇది ఎంతమాత్రమూ తక్కువ కాదని తేల్చి చెప్పారు.
కంటెంట్ మొత్తం ఇంగ్లీష్‌లో నింపడం పిల్లలను వారి మూలాలు, సంస్కృతి నుంచి దూరం చేయడంతోపాటు వారి విజ్ఞానంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
అందుకనే కొత్త (జాతీయ) విద్యావిధానం మాతృభాషలోనే పిల్లలకు విద్యాబోధన చేయాలని చెప్తున్నదని వివరించారు.  బహుభాషా విధానం అనేది కేవలం బోధించడానికి మాత్రమే కాదని.. పలు భాషలను నేర్చుకునేందుకు దోహదం చేస్తుందని సక్లాని చెప్పారు.  మన మాతృభాషను, మూలాలను అర్థం చేసుకోలేనప్పుడు మిగతాది ఎలా అర్థమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక కంటెంట్‌ మొత్తం ఇంగ్లీష్‌లో ఉండటం మొదలుపెడితే అక్కడే విజ్ఞానం కోల్పోవడం ప్రారంభం అవుతుందని సక్లానీ తెలిపారు. భాష అనేది శక్తినిచ్చేదిగా ఉండాలి కానీ.. కోల్పోయేవిధంగా ఉండకూడదని వెల్లడించారు. 
 
ఇప్పటివరకు మనం కోల్పోయిన దాన్ని బహుభాషా విద్య ద్వారా తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామని ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్ చెప్పారు. ఒడిశాలో గిరిజన విద్యార్థుల కోసం ఫోటోలు, కథలు, పాటలతో కూడిన పుస్తకాలను తయారు చేస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల స్థానిక సంస్కృతితోపాటు మాట్లాడటం, నేర్చుకునే నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. 
 
కేంద్ర ప్రభుత్వం 2020లో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చింది. కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలో చదువుకోవాలని సిఫార్సు చేసింది. 8, ఆపై తరగతుల్లోనూ మాతృభాషలోనే బోధించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.