అధ్యక్ష ఎన్నికల వేళ బైడెన్ ఆరోగ్య సమస్యలపై ఆందోళన

అధ్యక్ష ఎన్నికల వేళ బైడెన్ ఆరోగ్య సమస్యలపై ఆందోళన
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోగ్య సమస్యలపై ఆందోళన నెలకొంటుంది.  గత కొంత కాలంగా మతిమరుపు, తడబాట్లతో వార్తలలో నిలుస్తున్న ఆయన తాజాగా ఓ వేదికపై కొన్ని క్షణాల పాటు ఫ్రీజ్‌ అయిపోయారు. ఎలాంటి చలనం లేకుండా వేదికపై విగ్రహంలా నిల్చుండిపోయారు. ఇది గమనించిన మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా బైడెన్‌ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
 
శనివారం లాస్‌ఏంజెల్స్‌ లో జరిగిన ఫండ్‌ రైజింగ్‌ క్యాంపెయిన్‌లో పీకాక్‌ థియేటర్‌లో అర్ధరాత్రి జిమ్మీ కిమ్మెల్‌ తో 45 నిమిషాల పాటు సరదాగా ఇంటర్వ్యూ జరిగింది. అనంతరం స్టేజ్‌పై ఉన్న బైడెన్‌, ఒబామా అక్కడున్న వారికి అభివాదం చూస్తూ కనిపించారు. ఆ సమయంలో బైడెన్‌ దాదాపు 10 సెకన్లపాటు నిశ్చలంగా నిల్చుండిపోయారు. 
 
ఆయనలో ఎలాంటి చలనం లేకపోవడాన్ని గమనించిన బరాక్‌ ఒబామా బైడెన్‌ చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి నడిపించుకుని తీసుకెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అక్కడున్న కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.  ఇటీవలే బైడెన్‌ ప్రవర్తనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
గత వారం ఇటలీలో జరిగిన జీ7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన బైడెన్‌ అక్కడ గ‌మ్మత్తుగా ప్రవ‌ర్తించారు. ఇట‌లీ ప్రధాని జార్జియా మెలోనీని ఓ వేదికపై క‌లిసేందుకు వెళ్లిన ఆయ‌న‌ ఆ నేత‌ను హ‌గ్ చేసుకున్న త‌ర్వాత‌ చేతిని ఎత్తి సెల్యూట్ చేశారు. ఆ త‌ర్వాత నెమ్మదిగా వేదిక మీద నుంచి వెళ్లిపోయారు. గందరగోళంలో ఉన్న బైడెన్‌  ఇట‌లీ ప్రధానికి సెల్యూట్ ఎందుకు చేశారో అర్థం కాకుండా ఉన్నది.
 
ఇక మ‌రో వీడియోలో జీ7 స‌మావేశాల‌కు హాజ‌రైన నేత‌లు అంతా ఒక ద‌గ్గర ఉండ‌గా, ఆ గుంపు నుంచి బైడెన్ ఒక్కడే మ‌రో వైపు వెళ్లిపోయారు. కొన్ని ఫీట్ల దూరం వెళ్లిన త‌ర్వాత ఆయ‌న ఎవ‌రూ లేని దిశ‌కు థమ్స్ అప్ చూపించారు. మ‌నుషులు లేని దిక్కుకు వెళ్లి బైడెన్ ఎందుకు అలా చేశారో ఎవ‌రికీ తెలియ‌డంలేదు. 
 
కానీ ఆ స‌మ‌యంలో ఇట‌లీ ప్రధాని మెలానీ త్వర‌గా తేరుకుని బైడెన్ వ‌ద్దకు వెళ్లి ఆయ‌న్ను గ్రూప్ నేత‌ల‌కు ద‌గ్గర‌కు తీసుకువ‌చ్చారు. ఆ త‌ర్వాత ఆగ్రూప్ ఫోటోల‌కు ఫోజు ఇచ్చింది. ఇటీవ‌ల శ్వేత‌సౌధంలో మ్యూజిక‌ల్ ప‌ర్ఫార్మెన్స్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనూ బైడెన్ ఎటూ క‌ద‌ల‌కుండా చ‌ల‌నం లేని రీతిలో నిలుచుండిపోయారు. దీన్ని రిప‌బ్లిక‌న్లు త‌ప్పుప‌ట్టారు. 
 
ఆ స‌మ‌యంలో ఆయ‌న ప‌క్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు క‌మ‌లా హారిస్‌, ఆమె భ‌ర్త డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. బైడెన్ మాత్రం త‌దేకంగా చూస్తూ ఉండిపోయారు. అధ్యక్షుడి నడక కూడా కాస్త మారినట్లుగా వీడియోల్లో స్పష్టమవుతోంది.  వ‌య‌సు సంబంధిత స‌మ‌స్యల‌తో బైడెన్ బాధ‌ప‌డుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల బైడెన్‌ జ్ఞాపకశక్తిలో లోపాలను గుర్తించినట్లు గతంలో ఓ నివేదిక విడుదలైన విషయం తెలిసిందే. అధ్యక్షుడి జ్ఞాపకశక్తి చాలా ‘మసక’గా, ‘మబ్బు’గా ఉందని నివేదిక పేర్కొంది. జీవితంలో కీలక సంఘటనలను కూడా ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపింది. కుమారుడు బ్యూ బైడెన్‌ ఎప్పుడు చనిపోయారనే విషయం కూడా అధ్యక్షుడికి గుర్తుకు రాలేదని పేర్కొంది. అయితే ఈ నివేదికను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు.