జార్ఖండ్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్‌భమ్‌ జిల్లాలో మావోయిస్టులకు  భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో పెద్దమొత్తంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అశుతోశ్‌ శేఖర్‌ చెప్పారు. ఆప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు. 

కాగా, శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లా అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. నారాయణ్‌పూర్‌, కొండగావ్‌, కాంకేర్‌, దంతేవాడ డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, ఐటీబీపీ 53వ బెటాలియన్‌, బీఎస్‌ఎఫ్‌ 135వ బెటాలియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్‌ కొనసాగుతోంది. 

ఈ క్రమంలో శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో సాయుధులుగా ఉన్న మావోయిస్టులు తారసపడి జవాన్లపై మెరుపు వేగంతో కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు తేరుకుని ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఇరువర్గాల మధ్య సుమారు రెండు గంటలపాటు కాల్పులు చోటు చేసుకున్నాయి.

కాసేపటికి జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన 8 మంది మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. 

ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌, 303 రైఫిల్‌, బీజీఎల్‌ లాంచర్‌తోపాటు ఆయుధ వస్తు సామగ్రిని భారీగా జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక ఎస్టీఎఫ్‌ జవాన్‌ మృతి చెందగా, మరో ఇద్దరు ఎస్టీఎఫ్‌ జవాన్లు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.