కర్ణాటకలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే సాహసం చేయలేదు. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు ముగియడంతో పెట్రో వడ్డన ప్రారంభం అయింది. 
 
అయితే ఈసారి పెంపు భారీగా ఉండటంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ పెట్రో వడ్డన మొదలెట్టింది. లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై ఏకంగా రూ.3 వడ్డించింది. ఈ మేరకు కర్ణాటకలో పెట్రోల్, డీజిల్‌పై సేల్స్‌ ట్యాక్స్‌ పెంచినట్లు కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
 
తక్షణమే ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్‌లో సిద్ధరామయ్య సర్కార్ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా పెట్రో రేట్లను సవరించినట్లు అఖిల కర్ణాటక ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ వెల్లడించింది.  పెట్రోల్‌పై ఇప్పటివరకు ఉన్న 25.92 శాతం సేల్స్‌ ట్యాక్స్‌ను 29.84 శాతానికి పెంచినట్లు అఖిల కర్ణాటక ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ తెలిపింది. 
 
అదేవిధంగా డీజిల్‌పై 14.3 శాతం ఉన్న సేల్స్‌ ట్యాక్స్‌ను 18.4 శాతానికి పెంచినట్లు పేర్కొంది. ఇక ధరలు సవరించి సేల్స్‌ ట్యాక్స్‌ పెంచిన తర్వాత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.85 కు.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.88.93 కు పెరిగింది. అంతకుముందు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.84.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.85.93 గా ఉండేది.
 
దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడిచమురుపై పన్నును టన్నుకు రూ.5,200 నుంచి రూ.3,250కు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన కొద్ది గంటల్లోనే కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా పన్ను రేట్లను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తారు. ఈ ఏడాది మార్చిలో ఇంధన ధరలను లీటరుకు రూ.2 మేరకు కేంద్రం తగ్గించింది. 2022 మే తర్వాత దేశవ్యాప్తంగా ఇంధన ధరలను తగ్గించడం ఇదే తొలిసారి.
 
 రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత విదేశాంగ విధానం స్పష్టంగా లేకపోతే పెట్రోల్ ధరలు పెరిగేవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత నెలలో వ్యాఖ్యానించారు. మే 21, 2022 న, కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది, ఫలితంగా ధరలు లీటరుకు రూ .8, రూ .6 తగ్గాయి. ఈ చర్య వల్ల ప్రభుత్వం ఏడాదికి సుమారు లక్ష కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
 
సిద్దరామయ్య ప్రభుత్వం పెట్రోల్, డీసెల్ ధరలు పెంచడం పట్ల రాష్త్ర బీజేపీ అధ్యక్షుడు బిఎస్ విజయేంద్ర తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేబడతామని హెచ్చరించారు. ఐదు హామీల అమలుకు వనరులు సమీకరింపలేక సిద్దరామయ్య ప్రభుత్వం సంక్షోభకర పరిస్థితులు ఎదుర్కొంటున్నదని ఆయన ధ్వజమెత్తారు.
 
లోక్ సభ ఎన్నికలలో జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో అవమానకరమైన పరాజయం ఎదురు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల కక్షసాధింపు ధోరణితో ఈ విధంగా ధరలు పెంచుతున్నట్లు ఆయన ఆరోపించారు.