రెండున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం

అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. పి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉందని చెబుతూ రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. అలాగే అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ఉంటాయని చెప్పారు. 

అమరావతిలో అనేక భవనాల నిర్మాణం వివిధ దశల్లో నిలిచాయని, రాజధాని అభివృద్ధి బాధ్యతను చంద్రబాబు తనపై ఉంచారని తెలిపారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతామని మంత్రి నారాయణ వెల్లడించారు.

వైఎస్సార్సీపీ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని నారాయణ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఏపీకి మూడు రాజధానులంటూ నానా రచ్చ చేశారని విమర్శించారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని స్పష్టం చేశారు.

అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను రైతులు అందజేశారని గుర్తుచేశారు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చారని పేర్కొన్నారు. గతంలో రూ.48వేల కోట్లతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించాం. రూ.9వేల కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించామని మంత్రి నారాయణ వివరించారు.

గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని విమర్శించారు. చెత్తపన్నుతో సామాన్యులు బాగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో 11 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించామని గుర్తుచేశారు. వాటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. త్వరలోనే అన్ని సౌకర్యాలతో ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.