అరెస్టుపై యడియూరప్పకు హైకోర్టులో ఊరట

లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదైన పోక్సో  కేసులో బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17వ తేదీ వరకూ ఆయనను అరెస్టు చేయరాదని కర్ణాటక హైకోర్టు శుక్రవారంనాడు ఆదేశించింది.

ప్రత్యేక దర్యాప్తు బృందం (సీఐడీ) చేపడుతున్న విచరణకు సంబంధించిన ఫిర్యాదును కొట్టివేయాలని ఇటీవల హైకోర్టును యడియూరప్ప అశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా తన క్లయింట్ ఈనెల 17న సీఐడీ ముందు హాజరవుతారని హైకోర్టుకు యడియూరప్ప తరఫు న్యాయవాది సందీప్ సి పాటిల్ తెలిపారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. 

యడియూరప్ప మాజీ ముఖ్యమంత్రి కావడం, ఆయన వయస్సును దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు సంస్థ కోర్టుకు వెళ్లడం కానీ, అరెస్టు వారెంటు తెచ్చుకోవాల్సిన అవసరం కానీ లేదని కోర్టు అభిప్రాయపడినట్టు మీడియాతో మాట్లాడుతూ యడియూరప్ప న్యాయవాది తెలిపారు. 

17 ఏండ్ల బాలికను వేధించిన పోక్సో కేసులో దర్యాప్తు సంస్థ సీఐడీ విజ్ఞప్తి మేరకు యెడియూరప్పపై ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. అయితే తాను జూన్‌ 17న పోలీసుల ఎదుట హాజరవుతానంటూ యెడియూరప్ప పోలీసులకు లేఖ పంపినందున పిటిషనర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయడం, అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలు తీసుకోరాదని జస్టిస్‌ కృష్ణ ఎస్‌ దీక్సిత్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

తన కుమార్తెపై యడియూరప్ప లైంగిక దాడి చేసినట్టు బాలిక తల్లి గత మార్చిలో బెంగళూరు సదాశివనగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి సోదరుడు యడియూరప్పపై కోర్టులో పిటిషన్ వేశారు. బెంగళూరు కోర్టు వారెంట్ నేపథ్యంలో యడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తోంది.