రష్యా- ఉక్రెయిన్‌ మధ్య శాంతియుత పరిష్కారంకై ప్రయత్నాలు

రష్యా- ఉక్రెయిన్‌ దేశాల మధ్య శాంతియుత పరిష్కారం భారతదేశం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీకి వెళ్లిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 
 
ఈ సమావేశంలో ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అదేవిధంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా నేతలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకున్నారు. 
 
ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్‌ నడుమ ఉద్రిక్తతలకు పరిష్కారంపై భారతదేశం విధానాన్ని ప్రధాని వివరించారు. రష్యా దాడులను నిలిపేందుకై స్విజర్లాండ్ లో శాంతిసదస్సు జరుగనున్న సందర్భంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.  రష్యా- ఉక్రెయిన్‌ దేశాల మధ్య శాంతి నెలకొనాలనే తాము కోరుకుంటున్నామని.. చర్చల ద్వారా, దౌత్య మార్గాల ద్వారా శాంతియుత పరిష్కారం దక్కాలని తాము భావిస్తున్నామని ప్రధాని మోదీ జలెన్‌స్కీకి తెలియజేశారు. 
 
సమావేశానికి ముందు నేతలిద్దరూ కలుసుకోగానే ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని తమ మధ్య ఆప్యాయతను చాటారు. జెలెన్‌స్కీతో సమావేశానికి ముందు ప్రధాని మోదీ  ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ లతో భేటీ అయ్యారు. వీరితో పాటు పలువురు దేశాధినేతలతోనూ ప్రధాని మోద సంప్రదింపులు జరపనున్నారు.

దేశ ప్రధానిగా ఇటీవల వరుసగా మూడోసారి మోదీ పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ప్రపంచ నేతలతో ఫలవంతమైన చర్చలతో అంతర్జాతీయ సవాళ్లను అధిగమించడంతో పాటు మెరుగైన భవిష్యత్‌ కోసం అంతర్జాతీయ సహకారం సాధించే దిశగా అడుగులు పడతాయని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

ఇక ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ మధ్య రక్షణ, అణు, అంతరిక్ష, విద్య, డిజిటల్‌ మౌలిక వసతులు సహా పలు రంగాల్లో భాగస్వామ్యాల బలోపేతంపై చర్చలు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరువురు నేతలు కీలక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపింది. ఇక జీ7 సదస్సును ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ ప్రసంగిస్తారని వెల్లడించింది.

రిషి సునాక్ తో చర్చలు

కాగా,  బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధాని మోదీ ఇదే విధమైన సమావేశం నిర్వహించిన తర్వాత ఇద్దరు నేతలు కౌగిలించుకున్నారు. భారతదేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు సంతకం చేయాలనే ఆశతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) చర్చలను వేగవంతం చేయడానికి అంగీకరించినప్పుడు, మోదీ, సునక్ చివరిసారిగా గత సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన జి 20 సమ్మిట్‌లో వ్యక్తిగతంగా కలుసుకున్నారు.
 
ఏదేమైనా, జూలై 4న కొత్త ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మాత్రమే వాణిజ్య చర్చలు ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. భారతదేశం- బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం, వాణిజ్యాన్ని పెంచడం తదితర అంశాల గురించి ఇరువురు నేతలు మాట్లాడారు.
 
ఎన్‌డిఎ ప్రభుత్వ మూడో దఫాలో భారత్- యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తన నిబద్ధతను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం సంవత్సరానికి 38.1 బిలియన్ పౌండ్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నాలలో భాగంగా, సునాక్ అధికారంలోకి రాకముందు నుండి భారతదేశం, ఇంగ్లాండ్ చాలా కాలంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నాయి.
 
ఈ ఒప్పందంపైచర్చలు జనవరి 2022లో ప్రారంభం కాగా, దీపావళి 2022 గడువుగా  జాన్సన్ నిర్ణయించారు. అయితే, సునక్ నేతృత్వంలోని టోరీ ప్రభుత్వంలో, కొత్త గడువు ఏవీ నిర్ణయించలేదు. అయితే 2024లో భారతదేశం, ఇంగ్లాండ్ లలో సాధారణ ఎన్నికల సంవత్సరానికి ముందు రెండు వైపులా సంతకం చేయాలని ప్రయత్నించాయి. రెండు దేశాల మధ్య 13 దఫాలుగా చర్చలు జరిగాయి. 14వ దఫా చర్చలు గత జనవరిలో ప్రారంభమయ్యాయి.