తెరుచుకున్న పూరీ ఆలయ 4 ద్వారాలు

తెరుచుకున్న పూరీ ఆలయ 4 ద్వారాలు

* హామీ నెరవేర్చిన బీజేపీ సర్కార్

ఒడిశాలో మోహన్ చరణ మాఝి నేతృత్వంలో తొలిసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం మొదటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గురువారం ఉదయం పూరీలోని జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలను తెరిపించింది. అనంతరం సీఎం మోహన్ చరణ మాఝితోపాటు కేబినెట్ మంత్రులంతా జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్నారు.

ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో ఆలయ నాలుగు ద్వారాలను ఐదేళ్ల తర్వాత అధికారులు తెరిచారు. అన్ని ద్వారాల గుండా భక్తులు ఆలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆలయ నాలుగు ద్వారాలు తెరవడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కొత్త ముఖ్యమంత్రి మెహన్ చరణ నిర్ణయాన్ని భక్తులతోపాటు ఆలయ సేవకులు స్వాగతించారు.

“కేబినెట్ తొలి సమావేశంలో జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలను తెరవాలని నిర్ణయించాం. ఉదయం 6:30 గంటలకు నాతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంగళ హారతికి హాజరయ్యాం. జగన్నాథ దేవాలయ అభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో రూ.500 కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయిస్తాం.” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
2020 మార్చిలో కరోనా ఆంక్షలతో అప్పటి బీజేడీ ప్రభుత్వం  12వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ద్వారాలను మూసివేసింది. కేవలం సింహద్వారం నుంచే భక్తులను అనుమతించింది. కరోనా మహమ్మారి విజృంభన ముందుకు వరకు ఆలయంలోని నాలుగు ద్వారా నుంచి భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది.

ఆ తర్వాత కరోనా ఆంక్షలు ఎత్తివేసినా ద్వారాలను తెరవలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చినా బీజేడీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా తీసుకుని ప్రచారం చేసింది

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలయ నాలుగు తలుపులు తెరుస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత బీజేపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. ఒడిశా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోహన్ మాఝి ఆలయ నాలుగు ద్వారాలను భక్తుల కోసం తెరవాలని ఆదేశించారు. అనంతరం గురువారం నాలుగు ద్వారాలను భక్తుల కోసం తెరిచారు. పైగా, భక్తుల సౌకర్యార్థం షూ స్టాండ్‌లు, తాగునీటి వసతి, వర్షం నుంచి రక్షణ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.