ఏపీలో శాఖల వారీగా శ్వేత పత్రాలు

ఏపీలో శాఖల వారీగా శ్వేత పత్రాలు
వివిధ శాఖలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గురించి ప్రజలకు తెలియచెప్పేందుకు శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేయాలని నూతన  మంత్రులను ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం ప్రమాణస్వీకారం పూర్తికాగానే కుటుంభం సభ్యులతో కలిసి తిరుమలకు బయలుదేరేముందు తన నివాసంలో వారితో ఇష్టాగోష్టి జరిపారు.
వైసీపీ నాశనం చేసిన వ్యవస్థలను బాగుచేయాలని సంకల్పిస్తున్నట్లు చెబుతూ  మంత్రుల అభీష్టాలు, సమర్థత మేరకు శాఖలను గురువారం  కేటాయిస్తామని తెలిపారు. కేటాయించిన శాఖకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని స్పష్టం చేశారు. ఇక, మంత్రులు ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌లను నియమించుకొని విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని స్పష్టం చేశారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. 
 
గతంలో తాను సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిపై చంద్రబాబు విశ్లేషించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. గురువారం ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం తిరిగిరాగానే, సాయంత్రం 4.41 గంటలకు సచివాయలయంలో తాను లాంఛనంగా అధికార విధులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రిగా సచివాయంలో మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతల స్వీకారం అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయనున్నారు. 
 
గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టనున్నారు. సామాజిక పింఛన్ ను రూ. 4000 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు.