మంత్రులందరికీ ప్రధాని మోదీ తేనీటి విందు

మంత్రులందరికీ ప్రధాని మోదీ తేనీటి విందు

ప్రమాణ స్వీకారానికి ముందు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అందరికీ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి పని అప్పగించినా ఎంతో అణకువగా పనిచేయాలని ప్రధాని వారికి  సూచించారు. అణకువగా ఉండేవారినే సామాన్య ప్రజలు ప్రేమిస్తారని ఆయన చెప్పారు.

విశ్వయనీయత, పారదర్శకత విషయంలో రాజీపడొద్దని హితవు పలికారు. మనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అందుకు తగ్గట్టుగా అందరూ పనిచేయాలని సూచించారు.పార్టీలకు అతీతంగా ఎంపీలందరినీ గౌరవించాలని కోరారు. వాళ్లు కూడా ప్రజలు ఎన్నుకున్నవారేనని గుర్తుపెట్టుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, అధికారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని కోరారు. బృంద స్ఫూర్తిగా బృందంగా కలిసి పనిచేయాలని సూచించారు.

కాగా, దక్షిణాసియా సహకార సమాఖ్య-సార్క్ సభ్య దేశాల నాయకులు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు, మారిషస్‌ ప్రధాని పర్వింద్ కుమార్ జుగ్నౌథ్‌, భూటాన్‌ ప్రధాని షెరింగ్ తోగ్బే, షీచెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్ మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు కూడా హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేడీయూ అధినేత, బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఎన్సీపీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్ కూడా పాల్గొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా తరలివచ్చారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ వచ్చారు. బాలీవుడ్‌ నటులు షారూక్ ఖాన్, అక్షయ ఖాన్‌, నటుడు విక్రాంత్ మస్సే, నిర్మాత రాజ్‌కుమార్‌ హిరాణి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ తదితరులు హాజరయ్యారు.

మునుపటి మంత్రివర్గంలో పనిచేసిన చాలా మందికి తాజా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. స్మృతి ఇరానీ, అనురాగ్‌ ఠాకూర్‌, అజయ్‌ మిశ్రా, నారాయణ రాణే, మీనాక్షి లేఖి, అజయ్‌ భట్‌ సహా దాదాపు 37 మంది కమలం పార్టీ నేతలను క్యాబినెట్‌ నుంచి తప్పించారు. వీరిలో కొంతమంది తాజా ఎన్నికల్లో ఓడిపోగా,  మరికొంత మంది పోటీచేయలేదు.కొందరు గెలిచినప్పటికీ క్యాబినెట్‌లోకి తీసుకోకపోవడం గమనార్హం.