క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న వీకే పాండియన్‌

ఒడిశాలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగి, ప్రజల మన్ననలు పొందిన  బిజెడి అధినేత నవీన్ పట్నాయక్‌  ఘోరంగా  ఓటమిచెంది, బిజెపి  అధికారం చేపట్టేందుకు కీలక కారకుడిగా భావిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి వి కె పాండియన్ తాను క్రియాశీల రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉంటూ ఆయనకు దగ్గరై, ఐఏఎస్  గా రాజీనామా చేసి, మొత్తం పార్టీ వ్యవహారాలు ఆయనే పర్యవేక్షించారు.
 
 పైగా, పట్నాయక్ రాజకీయ వారసుడిగా ప్రచారం జరగడం, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలకు – పట్నాయక్ మధ్య అగాధం సృష్టించారని ఆరోపణలు తలెత్తడం, ఆయన కారణంగానే పలువురు సీనియర్ నేతలు బీజేపీలో చేరారని ప్రచారం జరగడం జరిగింది.
 
ఒడిశా ప్రజలు తనను క్షమించాలని వీకే పాండియన్‌ కోరారు. నవీన్‌ పట్నాయక్‌ను శాసిస్తున్నట్లుగా, ఆయన రాజకీయ వారసుడిగా ప్రచారం జరుగడం, ఎన్నికల్లో బీజేడీ ఓటమి నేపథ్యంలో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఒక వీడియో సందేశాన్ని పాండియన్‌ విడుదల చేశారు. 
 
చిన్న పల్లెకు చెందిన అతి సామాన్య కుటుంబం నుంచి తాను వచ్చానని తెలిపారు. ఐఏఎస్‌లో చేరి ప్రజలకు సేవ చేయాలనేది తన చిన్ననాటి కోరిక అని చెప్పారు. భగవంతుడైన జగన్నాథుడు దానిని సాకారం చేశారని పేర్కొన్నారు. కాగా, తన కుటుంబం మూలాలు కేంద్రపారాకు చెందినవి కావడంతో తమిళనాడు నుంచి ఒడిశాకు తాను వచ్చినట్లు వీకే పాండియన్‌ తెలిపారు. 
 
ఒడిశా గడ్డపై అడుగు పెట్టిన తొలి రోజు నుంచే అపారమైన ప్రజల ప్రేమ, గౌరవం తనకు లభించాయని చెప్పారు. ప్రజల కోసం తాను చాలా కష్టపడి పనిచేశానని తలిపారు. తనకున్న ఏకైక ఆస్తి తన పూర్వికుల నుంచి సంక్రమించినదని వివరించారు. ‘ఈ జీవితకాలంలో నేను సంపాదించిన అతిపెద్ద సంపాదన ఒడిశా ప్రజల ప్రేమ, ఆప్యాయత వారి ఆదరాభిమానాలు’ అని పేర్కొన్నారు.మరోవైపు 12 ఏళ్ల కిందట ప్రభుత్వ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తాను తన గురువైన నవీన్ పట్నాయక్‌కు సహాయం చేసేందుకే బీజేడీలో చేరినట్లు వీకే పాండియన్‌ తెలిపారు. ఇదే తన ఏకైక ఉద్దేశమని, నిర్దిష్ట రాజకీయ పదవి లేదా అధికారం కోసం తనకు ఎలాంటి కోరిక లేదని చెప్పారు.  తాను రాజకీయ అభ్యర్థిని కాదన్న ఆయన, బీజేడీలో ఏ పదవిని నిర్వహించలేదని వెల్లడించారు. ‘కొన్ని అవగాహనలు, కథనాలను సూటిగా సెట్ చేయాలనుకుంటున్నా. బహుశా ఈ రాజకీయ కథనాలను సరైన సమయంలో సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే నా లోటు’ అని తెలిపారు.

కాగా, రాజకీయాల్లో చేరాలనే తన ఉద్దేశం కేవలం నవీన్‌బాబుకు సహాయం చేయడం కోసమేనని వీకే పాండియన్‌ స్పష్టం చేశారు. ‘ఇప్పుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. ఈ ప్రయాణంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. నాపై జరిగిన ప్రచారం వల్ల బీజేడీకి నష్టం జరిగి ఉంటే క్షమించండి’ అని కోరారు.

ఒడిశాను ఎప్పుడూ తన హృదయంలో ఉంచుకుంటానని, గురువు నవీన్‌బాబును తన శ్వాసలో ఉంచుకుంటానని పాండియన్‌ తెలిపారు. ఒడిశా, నవీన్‌ పట్నాయక్‌ శ్రేయస్సు కోసం జగన్నాథుడిని ప్రార్థిస్తానని ఆయన పేర్కొన్నారు.