ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత
* ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రభూతుల సంతాపం
ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. 
 
వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు. మోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
 
రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ  సంతాపం వ్యక్తం చేశారు. పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ట్వీట్ చేశారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని తెలిపారు.

“మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు. ఆయనతో మాట్లాడే అవకాశం నాకు ఎన్నోసార్లు దక్కింది. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. రామోజీరావు అసంఖ్యాక అభిమానులకు నా సానుభూతి” అని మోదీ పోస్ట్ చేశారు.

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చెప్పారు.  అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 

రామోజీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొంటూ తెలుగు పాత్రికేయానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారని తెలిపారు. తెలుగు పారిశ్రామికరంగానికి రామోజీ విలువలు జోడించారని కొనియాడారు. మీడియా రంగంలో రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు. 

తెలుగు మీడియా మేరునగధీరుడు, వ్యాపారవేత్త, ప్రఖ్యాత సినీ నిర్మాత, రామోజీరావు మృతిపట్ల కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.  చిత్తశుద్ధి, అంకితభావంతో కష్టించి పనిచేస్తే.. ఏదైనా సాధించవచ్చు అని చెప్పేందుకు రామోజీరావు గారి జీవితం మన కళ్లముందున్న చక్కటి ఉదాహరణ.  తెలుగు పత్రికారంగంలో ‘ఈనాడు’ ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని కొనియాడారు.

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న జన్మించారు. గుడివాడలో విద్యాభాస్యం కొనసాగింది.  1962 అక్టోబరులో మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థను స్థాపించారు. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. ఆగస్టు 10 1974న విశాఖపట్నంలో రామోజీరావు  ‘ఈనాడు’ పత్రికను స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే ఈ పత్రిక సంచలనాలను సృష్టించింది. 

ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక పాఠకులను సంపాదించుకుంది.  ప్రాంతీయ దినపత్రికల చర్రితలో ‘ఈనాడు’ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. క్రమంగా హైదరాబాద్ ఎడిషిన్ తో పాటు జిల్లాల ఎడిషన్ లు కూడా ప్రచురితమయ్యాయి.  సినీ ప్రేమికుల కోసం రామోజీరావు ‘సితార’ పత్రికను ప్రారంభించారు. ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికలను కూడా తీసుకొచ్చారు.

 ‘ప్రియా ఫుడ్స్‌’ తో పాటు 1983లో ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ లో అనేక చిత్రాలను నిర్మించారు.   1990లో రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ను కూడా ప్రారంభించారు. ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ని కూడా రామోజీరావు ఏర్పాటు చేశారు. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పరిధిలో విస్తరించి ఉంటుంది. 

‘ఈటీవీ’ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతీయ ఛానళ్లను తీసుకొచ్చిని రామోజీరావు 2002లో ‘రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌’ను కూడా ఏర్పాటు చేశారు. పేపర్, టీవీ మీడియాలోనే కాకుండా డిజిటల్ మార్కెట్ లోకి విస్తరించేందుకు ఈటీవీ భారత్ పేరుతో మొబైల్ న్యూస్ యాప్ ను కూడా తీసుకొచ్చారు. రామోజీరావుకు భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘పద్మవిభూషణ్‌’ పురస్కారాన్ని కూడా ప్రకటించింది.