జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు

జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు

జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికల కమిషన్‌ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును అధికారికంగా ప్రారంభించింది. ఇసి కార్యదర్శి జయదేబ్‌ లాహిరి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జమ్ము కాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంత శాసన సభకు సాధారణ ఎన్నికల కోసం ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్‌ అండ్‌ అలాట్‌మెంట్‌) ఆర్డర్‌ 1968లోని పారా 10బి కింద ఉమ్మడి గుర్తును కేటాయించాలన్న దరఖాస్తులను తక్షణమే ఆమోదించాలని కమిషన్‌ నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

జమ్ము కాశ్మీర్‌ ప్రజలు త్వరలో ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించడానికి 2020లో డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. డీలిమిటేషన్ కసరత్తు తరువాత, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు కేటాయించిన వాటిని మినహాయించి, కేంద్రపాలిత ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుండి 90కి పెరిగింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగే మొదటి అసెంబ్లీ ఎన్నికలను ఈ కసరత్తు సూచిస్తుంది.  ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని గత ఏడాది సుప్రీంకోర్టు సమర్థించింది, ఈ నిబంధన తాత్కాలికమేనని, రద్దు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. 30 సెప్టెంబర్ 2024 నాటికి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం ఏర్పాటైన జమ్మూ, కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలను నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. 

ఎన్నికల సంఘం ప్రకారం, లోక్‌సభ ఎన్నికల సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. ఇందులో కాశ్మీర్ లోయలోని లోక్‌సభ స్థానాల్లో 51.05 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది దాదాపు నాలుగు దశాబ్దాలలో అత్యధికం. 2014లో జమ్ముకాశ్మీర్‌లో చివరిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ నేతృత్వంలో బిజెపి, పిడిపి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 

2016లో ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణించడంతో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. 2019 సంకీర్ణ ప్రభుత్వం నుండి బిజెపి వైదొలగడంతో ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం గవర్నర్‌ పాలన తర్వాత రాష్ట్రపతి పాలన విధించింది.  2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370, 35ఎ లను రద్దు చేయడంతో పాటు  కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. అప్పటి నుండి కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నేతృత్వంలో ఉంది.