కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడి

కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడి
 
* వంశీ నివాసం వద్ద టీడీపీ శ్రేణుల హల్ చల్
 
వైసిపి హయాంలో తెలుగు దేశం నాయకత్వంపై వ్యక్తిగత విమర్శలతో ప్రసిద్ధి చెందిన ఇద్దరు ఓటమి చెందిన మాజీ ఎమ్యెల్యేలపై టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నారు. గతంలో టిడిపి ఎమ్యెల్యేలుగా గెలుపొంది, తర్వాత వైసిపిలో చేరి నిత్యం టిడిపి నాయకత్వంపై అసభ్యపు పదజాలంతో దాడి చేస్తుండే వారిద్దరిపై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరిని పట్టుబట్టి ఈ ఎన్నికలలో టిడిపి శ్రేణులు ఓడించారు.
 
గుడివాడ మాజీ ఎమ్యెల్యే కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేయగా, గన్నవరం మాజీ ఎమ్యెల్యే వల్లభనేని వంశి ఇంటివద్ద హల్ చల్ చేశారు.  ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కొడాలి నాని గతంలో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని తన సవాల్‌ను నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి. 
 
ఈ క్రమంలోనే గుడివాడ వన్‌టౌన్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదంటూ వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవటంతో పోలీసులు, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది.
 
ఈ క్రమంలోనే కొంతమంది టీడీపీ కార్యకర్తలు పోలీసులను తోసుకుని కొడాలి నాని ఇంటివైపు పరుగులు తీశారు. నాని ఇంటి ఎదుట జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం టపాసులు కాలుస్తూ డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ కేకలు వేశారు. ఈ క్రమంలోనే మైక్ పట్టుకుని కొంతమంది పరుష పదజాలం ఉపయోగించారు. 
 
గుడివాడలో కొడాలి నానికి కౌంట్‌డౌన్ స్టార్ అయిందన్న టీడీపీ కార్యకర్తలు. ఇది ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే రాజకీయ సన్యానం చేస్తానని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన కొడాలి నాని తానే ఓడిపోయాడంటూ ఎద్దేవా చేశారు.
 
మరోవైపు 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి వైసీపీ తరుఫన పోటీ చేసిన కొడాలి నాని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో పరాజయం పాలయ్యారు. 2004 నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్న కొడాలి నానికి ఈ సారి ఓటమి తప్పలేదు. వెనిగండ్ల రాము చేతిలో 50 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కొడాలి నాని ఓటమి పాలయ్యారు.
 
కాగా, విజయవాడలో వల్లభనేని వంశీ ఇంటి పైన దాడికి ప్రయత్నం జరిగింది. టిడిపి మద్దతు దారులు వంశీ నివాసము ఉండే అపార్ట్మెంట్ ను నాలుగు వైపులా చుట్టు ముట్టి వాహనాల్లో అటూ ఇటూ తిరుగుతూ హల్ చల్ చేశారు. వంశి ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు వేశారు. పోలీసులు రంగంలోకి దిగి టిడిపి శ్రేణుల్ని చెదరగొట్టారు. 
 
నాలుగు కార్లలో వంశీ నివాస వద్దకు చేరుకున్న టిడిపి క్యాడర్ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వంశీ ఇంట్లోనే ఉన్నారని సమాచారంతో గేట్లు పగలకొట్టే ప్రయత్నం చేశారు. కర్రలు, రాళ్లతో యువకులు రావటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అక్కడున్న వారిని పంపించి వేశారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇప్పుడు ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి.