టీ20 ప్రపంచకప్ 2024 విజేతకు రూ 20.3 కోట్ల ప్రైజ్ మనీ

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ఇప్పటికే ప్రారంభం కాగా జట్లకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రైజ్‍మనీని భారీగా పెంచింది. ఆదివారం టీ20 ప్రపంచకప్ పోరు మొదలైంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఈ ప్రపంచ కప్ జరుగుతోంది. ఈ తరుణంలో ప్రైజ్‍మనీని వెల్లడించింది ఐసీసీ.

టీ20 ప్రపంచకప్‍ 2024 టోర్నీ కోసం మొత్తంగా 11.25 మిలియన్ డాలర్ల (రూ.93.5 కోట్లు) ప్రైజ్‍మనీని ఐసీసీ కేటాయించింది. టైటిల్ గెలిచిన జట్టుకు ఏకంగా 2.45 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20.3 కోట్లు) దక్కనున్నాయి. 2022లో ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్‍కు 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.12కోట్లు) అందాయి. దీన్ని ఇప్పుడు భారీగా పెంచింది ఐసీసీ. ఈ ఏడాది విజేతగా నిలిచే జట్టుకు రూ.20.3 కోట్ల అందనున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో రన్నరప్‍గా నిలిచిన జట్టుకు 1.28 మిలియన్ డాలర్లు (రూ.9.97కోట్లు) దక్కనున్నాయి. అలాగే ప్రతీ దశలో జట్లకు ప్రైజ్‍మనీని ఐసీసీ ప్రకటించింది.

2022 టీ20 ప్రపంచకప్‍కు 5.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.46.5 కోట్లు) ప్రైజ్‍మనీ ఇచ్చింది ఐసీసీ. అయితే, ప్రస్తుత టీ20 ప్రపంచకప్ 2024 ఎడిషన్‍కు ప్రైజ్‍మనీ మొత్తాన్ని 11.25 మిలియన్ డాలర్లకు (రూ.93.5 కోట్లు)పెంచింది. ఈ ఏడాది 20 జట్లు పాల్గొంటుండటంతో రెట్టింపు కంటే ఎక్కువగా అధికంగా చేసింది ఐసీసీ.

టి20 ప్రపంచ కప్ 2024 టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. రన్నరప్‍కు 1.28 మిలియన్ డాలర్లు అందుతాయి. సెమీఫైనల్‍లో ఓడిన రెండు జట్లకు తలా 7,87,500 (సుమారు రూ. 6.5 కోట్లు) డాలర్లు దక్కుతాయి.  సూపర్-8 దశలో టోర్నీ నుంచి నిష్క్రమించే టీమ్‍లకు చెరో 3,82,500 (సుమారు రూ.3.1కోట్లు) మిలియన్ డాలర్లు దక్కుతాయి. గ్రూప్ దశలో ప్రతీ గ్రూప్‍లో మూడో ప్లేస్‍లో నిలిచే టీమ్‍లకు 2,47,500 మిలియన్ డాలర్లు అందుతాయి. 13 నుంచి 20వ స్థానంలో ఉండే టీమ్‍లకు తలా 2,25,000 డాలర్లు లభిస్తాయి.

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జూన్ 29వ తేదీ వరకు జరగనుంది. గ్రూప్ దశ మ్యాచ్‍లు వెస్టిండీస్,  అమెరికా వేదికలుగా సాగుతాయి. ఆ తర్వాత సూపర్-8, సెమీస్, ఫైనల్ వెస్టిండీస్‍లో జరుగుతాయి. మొత్తంగా ఈ టోర్నీలో 55 మ్యాచ్‍లు జరగనున్నాయి. జూన్ 5వ తేదీన న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‍తో జరిగే మ్యాచ్‍లో టీ20 ప్రపంచకప్ వేటను టీమిండియా మొదలుపెట్టనుంది. ప్రస్తుతం న్యూయార్క్ స్టేడియంలో రోహిత్ శర్మ సేన ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. వామప్ మ్యాచ్‍లో బంగ్లాపై భారీగా గెలిచి జోష్ కనబరిచింది భారత్.