
147 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లు సాధించి విజయ కేతనం ఎగురవేసింది. బీజేడీ 51 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. మరోవైపు మిగతా స్థానాలను కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, స్వతంత్రులు పంచుకొన్నారు. రెండు స్థానాల నుంచి పోటీచేసిన నవీన్ పట్నాయక్ ఒకచోటనే గెలుపొందగా, మరోచోట ఓడిపోవడం గమనార్హం.
ఒడిశాలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబర్చింది. రాష్ట్రంలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఎన్నడూ లేని విధంగా ఏకంగా 19 స్థానాల్లో కమలం పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలోని అధికార బీజేడీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్క సీటుతోనే సరిపెట్టుకొన్నది.
బిజూ జనతా దళ్‌కు నవీన్ పట్నాయక్ ఒక్కరే ప్రజాకర్షణ గల, బలమైన నేత. బీజేడీకి 100 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నా పట్నాయక్‌లాంటి నేత ఒక్కరూ లేకపోవడం ఆ పార్టీని వేధిస్తోంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపట్ల నవీన్ పట్నాయక్ సానుకూలంగా ఉండడం కూడా ఆ పార్టీని ఇరుకున పెట్టింది.
ఈసారి ఎన్నికల్లో అసమ్మతి నాయకులతో బిజూ జనతా దళ్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 147 అసెంబ్లీ, 21 లోక్‌సభ స్థానాల్లో బీజేడీకి అసమ్మతివాదులు, తిరుగుబాటు నేతలు పెద్ద ఎత్తున పోటీ చేశారు. వీరి వల్ల బీజేడీ ఓట్లు చీలి బీజేపీకి బలంగా మారింది. ఎన్నికలకు ముందే బీజేడీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు బీజేపీలోకి వెళ్లడం ఆ పార్టీకి నష్టం చేకూర్చింది.
సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని అధికార బిజూ జనతాదళ్ ఇప్పటికే 24 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఒడిశాలో బీజేపీ ప్రధాన బలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఒడిశాలో మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన జాతీయ నాయకుడని అనేక పోల్స్ ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈసారి ఎన్నికల్లోనూ అది బాగా ప్రభావం చూపింది.
మోదీ సమర్థ నాయకత్వం, హిందూ అనుకూల నిర్ణయాలు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం బీజేపీకు కలిసివచ్చాయి. గత ఎన్నికల్ల ఒడిశాలో కాంగ్రెస్‌ను అధిగమించి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు చేరుకున్న బీజేపీ ఈసారి మరిన్ని స్థానాలు కైవసం చేసుకోని అధికార పీఠాన్ని అధిరోహించింది.
నవీన్ పట్నాయక్ వృద్ధాప్యంలో ఉండటం, వారసుడి విషయంలో ఒడిశా ప్రజలు పాండియన్‌ను స్వీకరించకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ప్రతి పనిలోనూ తమిళనాడుకు చెందిన పాండియన్‌ను ముందుంచడాన్ని ఒడిశా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. పైగా ఇదే ఆంశాన్ని బీజేపీ సైతం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.
సరిగ్గా ఎన్నికల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హిమంత బిశ్వ శర్మ లాంటి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణత వెనుక కుట్ర ఉందని, పాలనను ఆయన సమర్థంగా చేయలేకపోతున్నారని బీజేపీ విమర్శలు గుప్పించి లాభపడింది.
ఒడిశాలో పరిపాలన అంతా ఒడిశా యేతర అధికారులే నడిపిస్తున్నారన్న ఆరోపణ నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై ఉంది. దీనిని భారతీయ జనతా పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్ పట్నాయక్ ఎక్కువగా ఒడియేతర అధికారులపై ఆధారపడటాన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఘన విజయం సాధించింది.
ఒడిశాలో మహిళలు ఆశీర్వదించినంత కాలం తమ పాలనకు తిరుగులేదని ధీమాగా ఉన్న నవీన్ పట్నాయక్‌కు వారు సైతం ఈసారి వ్యతిరేకంగా ఓటేశారు. ఒడిశాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పటికీ మహిళలపై నేరాలు పెరిగాయి. వీటిని బలంగా మహిళల్లోకి తీసుకెళ్లి లాభపడింది బీజేపీ.
24 ఏళ్ల పాలనలో నిరుద్యోగం, వలసలు పెరగడం అధికార బిజు జనతా దళ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అవినీతి, శాంతిభద్రతలు, వరి సేకరణలో అక్రమాలు, చిట్ ఫండ్, మైనింగ్ స్కామ్ వంటివి ఒడిశా ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించాయి. నవీన్ పట్నాయక్ 24 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించినా ఒడిశా నుంచి యువకుల వలసలను అరికట్టడంలో విఫలమయ్యారని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ 24 సంవత్సరాలుగా ఒడిశాలో అధికారంలో లేదు. 2019 ఎన్నికల వరకు నంబర్ 2 స్థానంలో నిలిచిన కాంగ్రెస్ తర్వాత మరింత దిగజారింది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. కాంగ్రెస్ బలహీనపడడాన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీ బలంగా లాభపడింది. బీజేడీ-బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే బాగుంటుందని కాంగ్రెస్ భావించినా అది సాధ్యపడలేదు.
More Stories
సొంత ప్రజలపై పాక్ బాంబులు, ఉగ్రవాదులకు ఆశ్రయం
లేహ్‌లో రెచ్చిపోయిన ఆందోళనకారులు
జుబీన్ గార్గ్ అంతిమయాత్రకు అరుదైన రికార్డు