అగ్నిగోళంగా మారిన ఉత్తరాది.. నాగ్‌పూర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత

అగ్నిగోళంగా మారిన ఉత్తరాది.. నాగ్‌పూర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత
ఉత్తరాది రాష్ట్రాలు అగ్నిగోళంలా మండిపోతున్నాయి. ఈ వేసవిలోఅక్కడ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో 45 నుంచి 50 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు వేసవితాపాన్ని తాళలేక అల్లాడుతున్నారు.
 
 రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీని ముంగేష్‌పూర్‌లో 52.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీనికే ప్రజలు అమ్మో అనుకుంటుండగా శుక్రవారం మహారాష్ట్రలో ఆ రికార్డును దాటేస్తూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాగ్‌పూర్‌లో అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.   మన దేశ చరిత్రలో ఇప్పటివరకు నమోదు కాని విధంగా ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై సంచలనం సృష్టించింది.
ఈ ఎండకు నాగ్‌పూర్ వాసులు తట్టుకోలేకపోయారు. మరోవైపు తీవ్రమైన ఎండలు, వడగాలులతో దేశప్రజలు తీవ్ర ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు.
ఇప్పటికే వడదెబ్బ కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 24 గంటల వ్యవధిలోనే 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా బీహార్‌లో 32 మంది చనిపోగా, ఆ తర్వాత ఒడిషాలో 10 మంది, జార్ఖండ్‌లో ఐదుగురు, రాజస్థాన్‌లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు.
 
కాగా, ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో తీవ్ర జ్వరం, అధిక రక్తపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 మంది ఎన్నికల సిబ్బంది మృతి చెందారు. అయితే ఈ మరణాలకు కచ్చితమైన కారణం తెలియాల్సి ఉందని, వడదెబ్బ కారణంగానే చనిపోయారని చెప్పలేమని మా వింధ్యవాసిని అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్ బహదూర్ కమల్ తెలిపారు.
 
ఇక రానున్న రెండు రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్‌, హర్యానాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము తుపాను వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన వడగాలులు ఉన్నందున దేశంలో జాతీయ ఎమర్జెన్సీని విధించే అవకాశాలను పరిశీలించాలని రాజస్థాన్‌ హైకోర్టు కేంద్రానికి సూచించింది.
 
మరోవైపు దేశంలోకి కాస్త ముందుగానే ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. గురువారం కేరళ తీరాన్ని తాకిన ఈ నైరుతి రుతుపవనాలు.. ప్రస్తుతం దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉండటంతో శనివారం నుంచి వడగాలుల తీవ్రత కాస్త తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా నగరాల్లో ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం ఢిల్లీలో దాదాపు 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది. బెంగళూర్‌, చెన్నై నగరాల్లో ఉష్ణోగ్రతలు గతంలో ఎప్పుడూ లేని విధంగా పెరిగాయి. నగరాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడానికి ‘అర్బన్‌ హీట్‌-ఐలాండ్‌ ఎఫెక్ట్‌’ కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.