జమ్మూలో 150 అడుగుల లోయలో పడిన బస్సు.. 22 మంది మృతి

జమ్మూలో 150 అడుగుల లోయలో పడిన బస్సు.. 22 మంది మృతి
జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ జిల్లాలో ఓ బస్సులో భారీ లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 21 మంది ప్రయాణికులు స్పాట్‌లోనే చనిపోయినట్లు సమాచారం. ఇక అందులోని మరో 60 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.  జమ్మూ – పూంచ్ జాతీయ రహదారిపై చోకీ చోరా బెల్ట్‌లోని తంగ్లీమోర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం గురించి స్థానికులు ఇచ్చిన  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. లోయలో పడి నుజ్జునుజ్జయిన బస్సు నుంచి పలువురి మృతదేహాలను వెలికితీశారు.
 
యూపీ 81 సీటీ 4058 రిజిస్ట్రేషన్ నంబర్ గల బస్సు తంగ్లీమోర్ వద్ద లోయలో పడిపోయింది.  ప్రమాద సమయంలో బస్సులో 80 మందికి పైగా ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. యాత్రికులతో నిండిన ఆ బస్సు హరియాణాలోని కురుక్షేత్ర నుంచి జమ్ముకశ్మీర్‌లోని శివఖోరీకి బయల్దేరినట్లు పోలీసులు తెలిపారు.
 
 ప్రమాదానికి గురైన ఆ బస్సు 150 అడుగుల లోయలో బోల్తా పడినట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 12:35 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇక ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలో ఉన్న అక్నూర్ హాస్పిటల్, జమ్మూలోని గవర్నమెంట్ మెడికాల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
 
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఈ ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను ” అని సామాజిక మాధ్యమాల్లో ఆమె పోస్ట్ పెట్టారు.
 
ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ప్రమాదంలో యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.
 
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) మనోజ్ సిన్హా బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తగినంత శక్తి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
 
గాయపడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. రూ.50000 పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.5లక్షలు అందించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా సోషల్ మీడియాలో వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.