
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికిపైగా భక్తులు బాబా కేదార్ ను దర్శించుకున్నారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా ఈనెల 10న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచిన విషయం తెలిసిందే.
ఆలయం తెరిచిన 18 రోజుల వ్యవధిలో 5,09,688 మంది భక్తులు బాబా కేదార్‌ను దర్శించుకున్నారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాత్ర ఏర్పాట్లను రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ సౌరభ్ గహర్వార్ నిరంతరం సమీక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని సంబంధిత అధికారులందరినీ ఆదేశించారు.
పంచకేదార్‌లోని ప్రధాన క్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలను అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 10న తెరిచిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవం రోజునే రికార్డు స్థాయిలో 29,030 మంది భక్తులు బాబా కేదార్ దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు చార్‌ధామ్ యాత్రకు తరలివెళ్తుండటంతో రవాణా సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని స్పష్టంచేసింది. రిజిస్ట్రేషన్ తేదీ కన్నా ముందుగా ప్రయాణం పెట్టుకోవద్దని కోరింది. రిజిస్ట్రేషన్ లేని భక్తులకు యాత్రకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్