దోపిడీకి పాల్పడుతున్న ఇంజనీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు

దోపిడీకి పాల్పడుతున్న ఇంజనీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు
ఇంజనీరింగ్ విద్యార్థుల సీట్ల భర్తీ విషయంపై ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని, డొనేషన్ల పేరు మీద విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక భారం మోపుతూ ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న కళాశాలల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర  బిజెపి యువమోర్చ డిమాండ్ చేసింది.
బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్  ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి సమర్పించిన వినతి పత్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో వ్యాపార సంస్థలుగా మారాయని విమర్శించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల సీట్ల విషయంలో కళాశాలల యాజమాన్యాలు  స్పాట్ అడ్మిషన్ జరిపే విషయంలో, విద్యార్థులు స్లైడింగ్ పద్ధతిలో గ్రూపులు మార్చుకునే విషయంలో పారదర్శకంగా జరిగేటట్టు చూడాలని కోరారు. 
 
దీనితోపాటుగా అధిక ఫీజులతో విచ్చలవిడిగా విద్యా పేరుమీద వ్యాపారం చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలపై కట్టుదిట్టమైన  చర్యలు చేపట్టి వాటిని నియంత్రించాలని స్పష్టం చేశారు. దీని ద్వారా పేద విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు చూడాలని కోరారు.
 
 దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నటువంటి తెలంగాణ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకం న్యాయబద్ధంగా, అర్హత కలిగిన వారికి ఇచ్చే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైస్ ఛాన్సలర్ల నియామకంలో  సరియైన నియమ నిబంధనలు పాటించకపోతే అన్ని విశ్వవిద్యాలయాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
 
అనేక హామీలు ఇచ్చి  మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల, విద్య వ్యవస్థ పట్ల అలసత్వం  వహించకుండా తెలంగాణ పేద విద్యార్థులపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని ముఖ్యమంత్రిని కోరారు.  లేనిపక్షంలో విద్యార్థుల తరపున  యువ మోర్చా తెలంగాణలో ముఖ్యమంత్రిని,మంత్రులను రోడ్లపై అడ్డుకుంటామని హెచ్చరించారు.