పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తగ్గిన ఓటింగ్‌ శాతం

తెలంగాణలోని వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గింది. మొత్తం 12 జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గానికి సోమవారం జరిగిన ఎన్నికల్లో 68.65 శాతం పోలింగ్‌ నమోదైంది. 2021లో ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 74 శాతం పోలింగ్‌ జరగ్గా, ఇప్పుడు సుమారు 5 శాతం తక్కువ ఓటింగ్‌ నమోదైంది. 
 
ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 4,63,839 మంది ఓటర్లకు గాను 3,18,445 మంది 605 పోలింగ్‌ స్టేషన్‌లలో ఓటు వేశారు. ఉప ఎన్నిక, మూడేండ్ల పదవీకాలమే ఉన్నప్పటికీ అన్ని ప్రధాన పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అత్యధికంగా జనగామ జిల్లాలో 71.60 శాతం పోలింగ్‌ నమోదవ్వగా, తక్కువగా ఖమ్మంలో 65.64 శాతం మాత్రమే జరగడం గమనార్హం. 
 
గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 73.86 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఈసారి 66.5 శాతం మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్‌ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో నిలిచారు.

ప్రాధాన్యతా ఓటు పద్ధతి అయినందున బ్యాలెట్‌ విధానంలో ఉపఎన్నిక పోలింగ్‌ నిర్వహించారు. గతంలో చెల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు ముందుగానే వివరించి, అవగాహన కల్పించారు.

 ఉపఎన్నిక పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తిలోని 28వ పోలింగ్ బూత్ బ్యాలెట్ పేపర్ ముద్రణ సరిగ్గా లేదంటూ 45 మంది ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా, అధికారులు సమస్య పరిష్కరించారు. వరంగల్ ఏవీవీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద టెంట్లు తొలగించటంపై బీజేపీ, బీఆర్ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ తరహా మినహాయిస్తే మిగతా చోట్ల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.