కేదార్‌నాథ్‌ కు పోటెత్తుతున్న భక్తులు

చార్‌ధామ్‌ యాత్రలోని కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మే 10న కేదార్‌నాథ్‌ ధామ్‌ తెర్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేవలం పది రోజుల్లో 2.81లక్షల మంది భక్తులు బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. అయితే, కేదార్‌నాథ్‌కు ఏటా వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. 
 
2017లో 4.71లక్షల మంది తరలివచ్చారు. 2018లో 9లక్షల మంది, 2019లో పది లక్షల మందికిపైగా భక్తులు బాబా కేదార్‌నాథ్‌ దర్శనం కోసం వచ్చారు. 
2020-2021 సంవత్సరంలో కరోనా కాలంలో చివరి నెలల్లో యాత్ర కొత్త విజయాలు సాధించింది. కాగా, 2022లో 15.63 లక్షలు, 2023లో 19 లక్షలకుపైగా దర్శించుకున్నారు. 
 
ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ధామ్‌లో సౌకర్యాల కల్పనతో యాత్ర కొనసాగుతున్నది. కేదార్‌నాథ్ ధామ్‌లో గత తొమ్మిది సంవత్సరాలుగా పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2017 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధామ్‌కు చేరుకుని, పునర్నిర్మాణ పనులను తన కలల ప్రాజెక్ట్‌లో చేర్చారు.మూడు దశల్లో పనులు పూర్తి చేసేందుకు ఐదు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ధామ్‌లో మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఇందులో ఆలయ సముదాయం, ఆలయ రహదారి విస్తరణతో పాటు ఆదిగురు శంకరాచార్యుల సమాధి స్థలాన్ని సైతం పునర్నిర్మించారు. ప్రస్తుతం రెండో దశ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ స్వయంగా పలుమార్లు పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు. 2017 నుంచి 2022 వరకు 6 సార్లు కేదార్‌నాథ్‌లో పర్యటించారు.