రూ.45 లక్షల నగదు, 65 తులాల బంగారంతో ఎసిపి అరెస్ట్

రూ.45 లక్షల నగదు, 65 తులాల బంగారంతో ఎసిపి అరెస్ట్

ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో హైదరాబాద్  సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇళ్లలో ఎసిబి మంగళవారం సోదాలు చేపట, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. 12 గంటలుగా ఏసీపీకి చెందిన ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత రాత్రి వరకూ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో  పలు కీలక పత్రాలతో పాటు రూ.45 లక్షల నగదు, 65 తులాల బంగారం దొరికినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని ఏసీపీ నివాసం, ఆ అపార్ట్‌మెంట్ లోని మరో రెండు ఇళ్లు, సీసీఎస్‌ ఆఫీస్, ఉమామహేశ్వరరావు ఇద్దరు స్నేహితుల ఇళ్లు, ఏపీలో రెండు చోట్ల మొత్తం 14 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బయట మార్కెట్ ప్రకారం దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెండు లాకర్లను ఎసిబి అధికారులు గుర్తించారు.

ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సీసీఎస్ ఏసీపీగా ఉన్న ఆయన పలు కేసుల్లో లంచాలు తీసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. 

ముడుపులు తీసుకుంటూ బాధితులకు న్యాయం చేయకుండా నిందితులను తప్పించే ప్రయత్నాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఎసిబి ఇంట్లో సోదాలు విషయం తెలుసుకున్న బాధితులు అక్కడికి చేరుకుని అధికారులకు మొరపెట్టుకున్నారు. అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయని, పూర్తి కాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్ర మీడియాతో పేర్కొన్నారు.

ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు.  ఇబ్రహీంపట్నం రియల్ ఎస్టేట్ కేసుల్లో ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇబ్రహీంపట్నం రియల్ ఎస్టేట్ మర్డర్‌ కేసులో ఉమామహేశ్వరరావును పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. 

గతంలో అవినీతి ఆరోపణలతో పలుమార్లు సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకోలేదని చెబుతున్నారు. హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఉమామహేశ్వరరావు నివాసాల్లో కూడా ఏసీబీ సోదాలు జరుపుతోంది.  జవహర్‌నగర్‌లో విధులు నిర్వర్తించిన సమయంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఏసీపీ ఉమామహేశ్వరరావు ఒకసారి సస్పెండ్ అయ్యారు. 

సర్వీసులో ఇప్పటి వరకు మూడు సార్లు ఉమామహేశ్వరరావును సస్పెండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే మరోసారి సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది.