ఎన్నికల్లో విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ

ఎన్నికల్లో విపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ
అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ, సనాతన వ్యతిరేకుల పక్షాన నిలుస్తున్న ఇండియా కూటమికి జూన్ 4న ఫలితాల్లో గట్టి దెబ్బ తగులుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని తూర్పు చంపారన్​లోని మోతిహరిలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. వెండి చెంచాలతో పుట్టిన వారికి కష్టం విలువ ఏంటో తెలియదని మోదీ దుయ్యబట్టారు.
ఇండియా కూటమి పాపాలతో దేశం ముందుకు సాగదని చెప్పారు. అంబేద్కర్ లేకపోయి ఉంటే మాజీ ప్రధాని నెహ్రూ ఎస్సి, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేవారు కాదని మోదీ ఆరోపించారు.  బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు విమర్శించడంపై మోదీ ఘాటుగా బదులిచ్చారు. స్విస్ బ్యాంకుల్లో నోట్ల కట్టలున్న వారికి సామాన్య ప్రజల పరిస్థితి అర్థం కాదని, పేద కుటుంబంలో పుట్టిన తనకు తెలుసని వ్యాఖ్యానించారు.

“కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు కలిసి దేశాన్ని 60 ఏళ్లు నాశనం చేశాయి. 3 నుంచి 4 తరాల జీవితాలను నాశనం చేశాయి.పేదవాడు మరింత పేదవాడయ్యాడు. ఈ 60 ఏళ్లలో కాంగ్రెస్ పెద్ద పెద్ద రాజభవనాలను నిర్మించుకుంది. స్విస్ ‌బ్యాంకులో ఖాతా తెరిచింది. కానీ ప్రజలకు కడుపు నిండటానికి అన్నం లేదు. సిల్వర్ స్పూన్​తో పుట్టిన వారికి కష్టం అంటే తెలియదు” అంటూ ప్రధాని విమర్శించారు.

“నేను ఇటీవల ఒకటి విన్నాను. కొందరు జూన్ 4 తర్వాత మోదీ బెడ్ రెస్ట్ తీసుకుంటారని అక్కడక్కడ తిరిగి ప్రచారం చేస్తున్నారు. నేను ఆ దేవుడిని ప్రార్థిన్నాను. మోదీకే కాదు దేశంలోని ఏ పౌరుడికి కూడా బెడ్‌ రెస్ట్ రావొద్దని కోరుకుంటున్నాను. దేశంలోని ప్రతి పౌరుడు శక్తిని కలిగి ఉండి బాగా జీవించాలి” అని మోదీ తెలిపారు.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే జూన్ 4 ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ విప‌క్ష ఇండియా కూట‌మిలో అస‌హ‌నం పెరుగుతోంద‌ని, ఓట‌మి భ‌యంతో మోదీని దూషిస్తున్నార‌ని ప్ర‌ధాని మ‌హ‌రాజ్‌గంజ్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార సభలో ధ్వజమెత్తారు. దేశ ప్ర‌జ‌లు రాబోయే ఐదేండ్ల‌కు మ‌రోసారి మోదీని ఎన్నుకోనుండ‌టాన్ని విపక్ష నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని ఎద్దేవా చేశారు.

మీ పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం కేంద్రంలో ప‌టిష్ట ప్ర‌భుత్వం ఏర్పాటు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. విక‌సిత్ భార‌త్ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చే దిశ‌గా మ‌రోసారి బీజేపీ ప్ర‌భుత్వానికి ప‌ట్టం క‌ట్టాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.